Mahaa Daily Exclusive

  అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ సమరశంఖం..! బళ్లారి చలో’ పాదయాత్రలో పాల్గొన్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి..

Share

• ‘బళ్లారి చలో’ పాదయాత్రలో పాల్గొన్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి.

హైదరాబాద్, మహా.
కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి, పరిపాలనా వైఫల్యాలు, దళితులు, గిరిజనుల సంక్షేమంపై అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ‘బళ్లారి చలో’ పాదయాత్రలో ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల జాతీయ సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. రాయచూర్‌ జిల్లా లింగసుగూర్‌ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.పాదయాత్రకు కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర, శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఆర్‌. అశోక్‌, శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు ఛలవాది నారాయణస్వామి, మాజీ ముఖ్యమంత్రులు బి.ఎస్‌. యడియూరప్ప, జగదీశ్‌ శెట్టర్‌, బసవరాజ్‌ బొమ్మై, మాజీ ఉప ముఖ్యమంత్రి గోవింద్‌ కారజోల్‌, సీనియర్‌ నాయకులు బి. శ్రీరాములు, జి. జనార్దన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య ఉద్యమంగా యాత్ర

లింగసుగూర్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర కల్యాణ కర్ణాటక ప్రాంతంలోని పలు నియోజకవర్గాల మీదుగా సాగి బళ్లారిలో ముగియనుంది. ఈ యాత్ర కేవలం రాజకీయ కార్యక్రమం కాదని, ప్రజల కోసం పారదర్శకత, జవాబుదారీతనం, సామాజిక న్యాయం కోరుతూ బీజేపీ చేపట్టిన ప్రజాస్వామ్య ఉద్యమమని పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

గిరిజన నిధుల దుర్వినియోగంపై ప్రశ్నలు

మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల దుర్వినియోగ ఆరోపణలను బీజేపీ మొదటి నుంచీ తీవ్రంగా ప్రశ్నిస్తోందని సుధాకర్‌రెడ్డి తెలిపారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం లేదా దుర్వినియోగం చేయడం అత్యంత తీవ్రమైన అంశమని అన్నారు.

మాజీ మంత్రి బి. నాగేంద్ర రాజీనామాను ప్రస్తావిస్తూ.. ఒక మంత్రి రాజీనామా చేయడం మాత్రమే వ్యవహారానికి ముగింపు కాదని స్పష్టం చేశారు. గిరిజనుల కోసం కేటాయించిన ప్రతి రూపాయికి ప్రభుత్వం లెక్క చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దుర్వినియోగమైన నిధులను తిరిగి రాబట్టి, అవి ఎవరి కోసం కేటాయించబడ్డాయో వారికి చేరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ బాధ్యతతోపాటు పరిపాలనా, చట్టపరమైన జవాబుదారీతనం కూడా ఉండాలని పేర్కొన్నారు.

ప్రజా సమస్యలే ప్రధాన అజెండా

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధుల మళ్లింపు ఆరోపణలతోపాటు సామాజిక భద్రతా పింఛన్లు, గృహలక్ష్మి పథకానికి సంబంధించిన సమస్యలు, రైతుల ఇబ్బందులు, కరువు పరిస్థితులు, నిరుద్యోగం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు, కల్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధి వంటి అనేక అంశాలను పాదయాత్ర ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నామని సుధాకర్‌రెడ్డి తెలిపారు.

బళ్లారి వరకు కొనసాగనున్న యాత్ర

లింగసుగూర్‌ నుంచి బళ్లారి వరకు సాగుతున్న ‘బళ్లారి చలో’ పాదయాత్ర కర్ణాటక ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని ఇస్తోందని సుధాకర్‌రెడ్డి అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా, పారదర్శక పరిపాలన కోసం, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్న వేలాది మంది కార్యకర్తలను ఆయన అభినందించారు.

Latest