Mahaa Daily Exclusive

  సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలి..: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు..

Share

• నిజాం వ్యతిరేక పోరాట చరిత్రను భావితరాలకు అందించాలి.
• బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు

పరకాల, మహా.

తెలంగాణ విమోచన పోరాటంలో పరకాల అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన వీరోచిత పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు అన్నారు. పరకాల అమరధామంలో అమరవీరుల స్తూపం వద్ద ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ విమోచన పోరాట చరిత్రను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఎనభై ఏళ్ల క్రితం నిజాం నిరంకుశ పాలనలో రజాకార్లు పరకాల ప్రాంత ప్రజలపై సాగించిన దాడులు, మారణకాండ చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనలుగా నిలిచిపోయాయని రామచందర్‌రావు పేర్కొన్నారు. పరకాలలోని చాపలబండ వద్ద 19 మందిని, సమీపంలోని లక్ష్మీపూర్‌లో మరో ముగ్గురిని దారుణంగా హతమార్చారని, ఈ ఘటనల్లో దాదాపు రెండు వందల మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ప్రజలపై రజాకార్లు సాగించిన దమనకాండను గుర్తుచేసుకుంటూ అమరవీరుల త్యాగాలకు నివాళులు అర్పించారు.

నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల పోరాటం

నాటి హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయకుండా స్వతంత్రంగా కొనసాగించాలని నిజాం భావించారని, మరోవైపు పాకిస్థాన్‌తో కలపాలనే ప్రయత్నాలు కూడా జరిగాయని రామచందర్‌రావు ఆరోపించారు. ఆ సమయంలో రజాకార్లు గ్రామాలపై దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని, మహిళలు, రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

గుండ్రాంపల్లిలో బావిలో పడేసి పలువురిని హతమార్చిన ఘటనలు, బైరాన్‌పల్లిలో ప్రజలను వరుసగా నిలబెట్టి కాల్చిచంపిన సంఘటనలు నాటి దమనకాండకు నిదర్శనాలని అన్నారు. ప్రజల స్వేచ్ఛ కోసం అనేకమంది ప్రాణాలను త్యాగం చేశారని, వారి పోరాట ఫలితంగానే హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందని తెలిపారు.

ఆపరేషన్‌ పోలోతో హైదరాబాద్‌ విలీనం

హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్‌ పోలో అనంతరం నిజాం లొంగిపోయారని రామచందర్‌రావు పేర్కొన్నారు. 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో అంతర్భాగమైందని గుర్తుచేశారు.

తెలంగాణ విమోచన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి తరానికి బాధ్యతగా ఉండాలని అన్నారు. సి.హెచ్‌. విద్యాసాగర్‌రావు నాయకత్వంలో తెలంగాణ విమోచన సమితి ఆధ్వర్యంలో పరకాల అమరధామ స్తూపాన్ని నిర్మించారని, ఆ కమిటీలో తాను కూడా సభ్యుడిగా పనిచేసిన విషయం తనకు గర్వకారణమని తెలిపారు.

ఎందరో మహనీయుల పోరాటం

హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి అనేకమంది జాతీయవాదులు, స్వాతంత్ర్య సమరయోధులు పోరాడారని రామచందర్‌రావు పేర్కొన్నారు. పీవీ నరసింహారావు, స్వామి రామానంద తీర్థ, వందేమాతరం రామచంద్రరావు, షోయబుల్లా ఖాన్‌, తుర్రేబాజ్‌ ఖాన్‌ తదితరులు తమదైన రీతిలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని గుర్తుచేశారు.

వందేమాతరం నినాదంతో ప్రజలు సాగించిన ఉద్యమం నాటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జాతీయ భావాలను బలపరిచిందన్నారు. విమోచన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వారి చరిత్రను కేవలం ఒక రోజుకే పరిమితం చేయకుండా నిరంతరం స్మరించుకోవాలని సూచించారు.

ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శ

సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించే విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలపై రామచందర్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంలో ప్రభుత్వాలు వెనుకంజ వేస్తున్నాయని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించిందని ఆయన విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన పోరాట చరిత్రను అధికారికంగా గుర్తించడంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

కర్ణాటక, మహారాష్ట్రలో నిర్వహిస్తుంటే తెలంగాణలో ఎందుకు?

పూర్వ హైదరాబాద్‌ సంస్థానంలో భాగంగా ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహిస్తున్నారని రామచందర్‌రావు పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాలు విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజలకు సంబంధించిన చారిత్రక ఘట్టాన్ని రాజకీయ కారణాలతో పక్కన పెట్టడం సరికాదన్నారు. విమోచన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల పట్ల గౌరవం చూపడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

కేంద్రం నిర్వహిస్తుంటే రాష్ట్రం ఎందుకు వెనుకంజ?

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 17ను సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో అధికారికంగా నిర్వహిస్తోందని రామచందర్‌రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ విమోచన పోరాట చరిత్రను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు.

విమోచన పోరాట చరిత్రను రాజకీయాలకు అతీతంగా చూడాలని, అమరవీరుల త్యాగాలను గౌరవించడంలో ఎలాంటి భేదాభిప్రాయాలకు తావు ఉండకూడదని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన చారిత్రక అంశాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే పాఠ్యపుస్తకాల్లో చరిత్ర

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విమోచన పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భావితరాలకు అందిస్తామని రామచందర్‌రావు స్పష్టం చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటం, అమరవీరుల త్యాగాలు, హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రక పరిణామాలను విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

చరిత్రను మరుగునపడేలా చేసే ప్రయత్నాలను బీజేపీ అంగీకరించదని అన్నారు. తెలంగాణ విమోచన పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి త్యాగాన్ని గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ప్రతి పల్లెలో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలి

సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని రామచందర్‌రావు డిమాండ్‌ చేశారు. ఆ రోజు తెలంగాణలోని ప్రతి పల్లెలో, ప్రతి విద్యాసంస్థలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలని ప్రజలకు, యువతకు పిలుపునిచ్చారు.

Latest