- వెయ్యి రోజుల పీడన.
- 4.5 లక్షల కోట్ల అప్పులు.
- రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి?
- అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ రూపొందించిన ‘ఛార్జ్‌షీట్’ను విడుదల చేసిన ఆయన.. ఈ వెయ్యి రోజులు ప్రజలకు పాలన కాకుండా పీడనగా మారాయని విమర్శించారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో రూ.4.50 లక్షల కోట్ల అప్పులు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఇంత భారీగా అప్పులు చేసినప్పటికీ రాష్ట్రంలో కొత్తగా ఒక్క ఇటుక కూడా వేయలేదని, కొత్తగా ఒక్క చెక్‌డ్యాం కూడా నిర్మించలేదని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, మౌలిక వసతులకు రిబ్బన్ కటింగ్‌లు చేయడం తప్ప కొత్తగా సాధించిందేమీ లేదన్నారు.
యువతకు ఉద్యోగాలేవి?
కాంగ్రెస్‌కు ఓటేసిన యువతకు ఈ ప్రభుత్వంలో ఏం మిగిలిందని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల పరిస్థితి ఏమిటని నిలదీశారు. యువత ఉద్యోగాలు అడుగుతుంటే.. ప్రభుత్వం మాత్రం జేబులు నింపుకోవడంలో బిజీగా ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. యువత సమస్యలను రానున్న శాసనసభ సమావేశాల్లో గట్టిగా ప్రస్తావిస్తామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించిన జీవో నంబర్ 97పై కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.
రాహుల్‌గాంధీ తెలంగాణ యువత సమస్యలపై దృష్టి పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జెన్‌జీ యువతతో ఫొటోలు దిగుతున్న రాహుల్‌గాంధీకి తెలంగాణలో నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
రైతుల పరిస్థితిపై ఆగ్రహం
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో వెయ్యికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దేశంలోనే తొలిసారిగా రైతుబీమా తీసుకొచ్చామని, రైతులకు భరోసా కల్పించామని అన్నారు. ప్రస్తుతం ఉన్న రైతుబీమా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రైతుబంధు పథకం నిలిచిపోయిందని, దాని స్థానంలో ‘రాహుల్ బంధు’ వచ్చిందంటూ ఎద్దేవా చేశారు.
‘అసమర్థత ప్రో మ్యాక్స్.. అవినీతి అల్ట్రా మ్యాక్స్’
ప్రభుత్వ పనితీరుపై కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం హై మ్యాక్స్ స్థాయికి చేరిందని విమర్శించారు. నీళ్లు అడిగిన ప్రజలపై కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.








