Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు భారీ ఊరట..! సైదాబాద్‌ ఉక్కు వంతెన సిద్ధం..

Share

  •  సైదాబాద్‌ ఉక్కు వంతెన సిద్ధం.
  • నేడు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం.

హైదరాబాద్‌, మహా.

హైదరాబాద్‌ పాతబస్తీ ప్రజలు, వాహనదారులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న సైదాబాద్‌ ఉక్కు వంతెన అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం సాయంత్రం 4 గంటలకు ఈ వంతెనను ప్రారంభించనున్నారు. అనంతరం చంచల్‌గూడ జూనియర్‌ కళాశాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. దీంతో సైదాబాద్‌, చంచల్‌గూడ, ఐఎస్‌ సదన్‌, చంపాపేట, కంచన్‌బాగ్‌, మలక్‌పేట ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాల నుంచి గణనీయమైన ఉపశమనం లభించనుంది.

చంచల్‌గూడ ప్రభుత్వ ముద్రణాలయం నుంచి సంతోష్‌నగర్‌ వరకు ఈ ఉక్కు వంతెనను నిర్మించారు. సుమారు 3.2 కిలోమీటర్ల పొడవుతో, నాలుగు వరుసలుగా నిర్మించిన ఈ వంతెన నగరంలోని కీలక రహదారులను కలుపుతూ అంతరాయం లేని రాకపోకలకు మార్గం సుగమం చేయనుంది.

రూ.620 కోట్లతో భారీ నిర్మాణం

ఈ ప్రాజెక్టుకు మొత్తం సుమారు రూ.620 కోట్ల వ్యయం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భూసేకరణకే రూ.153.37 కోట్లు ఖర్చు చేశారు. భూసేకరణ, నిర్మాణానికి సంబంధించిన పలు సవాళ్లను అధిగమిస్తూ పనులను పూర్తి చేశారు. ఈ వంతెన పూర్తికావడంతో దశాబ్దాలుగా ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడుతున్న పాతబస్తీ ప్రజలకు పెద్ద ఊరట లభించనుంది.

సిగ్నల్‌ రహిత ప్రయాణానికి అవకాశం

నల్గొండ ‘ఎక్స్‌’ రోడ్డు నుంచి సైదాబాద్‌, ఐఎస్‌ సదన్‌ మీదుగా ఓవైసీ జంక్షన్‌ వైపు వెళ్లే వాహనాలకు ఈ కారిడార్‌ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. సైదాబాద్‌, చంచల్‌గూడ, ఐఎస్‌ సదన్‌ ప్రాంతాల్లో తరచూ ఏర్పడే ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణ సమయాన్ని కూడా గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది.

వంతెన అందుబాటులోకి రావడంతో చంపాపేట, చంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్‌ వైపు వెళ్లే వాహనాలకు కూడా మెరుగైన రాకపోకలు సాధ్యమవుతాయి. రద్దీ సమయంలో రహదారులపై వాహనాలు నిలిచిపోయే పరిస్థితి తగ్గడంతో ఇంధన వినియోగం, వాయు కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఏళ్ల నిరీక్షణకు తెర

సైదాబాద్‌ ప్రాంతంలో పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు లేకపోవడంతో ఇక్కడి ప్రధాన కూడళ్లలో తరచూ భారీగా ట్రాఫిక్‌ స్తంభించేది. ముఖ్యంగా చంచల్‌గూడ, సైదాబాద్‌, ధోబీఘాట్‌, ఐఎస్‌ సదన్‌ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ నేపథ్యంలో నిర్మించిన ఉక్కు వంతెన పూర్తికావడంతో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Latest