Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌ కేఫ్‌లలో అపరిశుభ్రత బట్టబయలు..!

Share

• గడువు ముగిసిన ఆహార పదార్థాలు.
• ఈగలు, బొద్దింకల బెడద.
• టీజీ సేఫ్‌ తనిఖీల్లో వెలుగుచూసిన దారుణాలు.

హైదరాబాద్‌, మహా:
నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లు, కేఫ్‌లు, స్నాక్‌ కేంద్రాల్లో ఆహార భద్రతా ప్రమాణాలపై టీజీ సేఫ్‌ అధికారులు కొరడా ఝళిపించారు. ప్రత్యేక బృందాలతో నిర్వహించిన తనిఖీల్లో పలు చోట్ల ఆహార పదార్థాల నిల్వ, తయారీ ప్రాంతాల్లో తీవ్ర అపరిశుభ్రత, గడువు ముగిసిన పదార్థాలు, పురుగుల బెడద వంటి లోపాలు బయటపడ్డాయి.

పలుచోట్ల ఆహార పదార్థాలను సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడంతోపాటు దుమ్ము, ధూళి పేరుకుపోయిన పరిస్థితులు కనిపించాయి. కొన్ని కేంద్రాల్లో ఈగలు, బొద్దింకల బెడదను అధికారులు గుర్తించారు. కుళ్లిపోయిన కూరగాయలు, నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాల నిర్వహణ, లేబులింగ్‌లో లోపాలను కూడా గుర్తించారు.

తాజా తనిఖీల్లో ఏడు ప్రముఖ రెస్టారెంట్లను పరిశీలించిన అధికారులు కల్తీ అనుమానంతో 11 ఆహార నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు నాలుగు మెరుగుదల నోటీసులు, మూడు కారణం చూపాలనే నోటీసులు జారీ చేశారు. ప్రయోగశాల నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

గచ్చిబౌలిలోని ఓ రెస్టారెంట్‌ నిల్వ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 15 కిలోల జీడిపప్పు, 24 కిలోల పొడి నూడుల్స్‌, 5 కిలోల బంగాళాదుంప చిప్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.17,500గా అధికారులు తెలిపారు.

నగరంలో ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై తనిఖీలు, చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించేందుకు పరిశుభ్రత, నిల్వ, తయారీ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.

Latest