• రాజకీయ కక్షతోనే కేసు పెట్టించారు.
• ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు పెట్టినా ఎదుర్కొంటాం.
• కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.
న్యూఢిల్లీ, మహా:
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ ర్యాలీ ప్రాంగణంలో జరిగిన శుద్ధీకరణ కార్యక్రమంపై వివాదం కొనసాగుతున్న వేళ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. రాహుల్‌ను భయపెట్టడం, మానసికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా కేసు నమోదు చేయించారని ఆరోపించారు. ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినా కాంగ్రెస్ వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు. దళితులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ద్రవ్యోల్బణం వంటి ప్రజా సమస్యలపై రాహుల్ నిరంతరం ప్రశ్నిస్తున్నందుకే ఆయనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఖర్గే విమర్శించారు.
హల్ద్వానీ ఘటనను కేవలం శుద్ధీకరణ కార్యక్రమంగా చూడలేమని ఖర్గే అన్నారు. దీనికి అంటరానితనం కోణం కూడా ఉందని పేర్కొన్నారు. దళితుల హక్కుల కోసం రాహుల్ గాంధీ గొంతెత్తుతున్నారని, అలాంటి నాయకుడిని ఎఫ్‌ఐఆర్‌లతో భయపెట్టే ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు. ‘‘రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత. పార్లమెంట్‌లోనే కాకుండా బయట కూడా ప్రజా సమస్యలపై గొంతెత్తుతున్నారు. విద్యార్థులు, మహిళలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, దళితుల సమస్యలపై ప్రశ్నిస్తున్నారు. ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు పెట్టినా మేం ఎదుర్కొంటాం’’ అని ఖర్గే పేర్కొన్నారు.
ఆగస్టు 8న ర్యాలీతో మొదలైన వివాదం
హల్ద్వానీలో ఆగస్టు 8న కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది. రాంలీలా మైదానంలో జరిగిన ఈ సభకు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. సభ ముగిసిన అనంతరం కొందరు వ్యక్తులు అదే ప్రాంగణంలో శుద్ధీకరణ యజ్ఞం నిర్వహించడంతో వివాదం మొదలైంది. దళిత సామాజిక వర్గానికి చెందిన తనను అవమానించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించారని ఖర్గే రాజ్యసభలో ప్రస్తావించారు.
‘‘నేను దళిత సమాజానికి చెందిన వ్యక్తిని. నా గురించి ఒక నాయకుడు మాట్లాడిన తర్వాత ఇలాంటి ఘటన జరగడం సరైనది కాదు. ఇది నా ఒక్కరి సమస్య కాదు.. దేశంలోని దళితులందరి సమస్య’’ అని ఖర్గే అప్పట్లో వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ఈ వివాదంపై రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా స్పందించారు. ర్యాలీ ప్రాంగణంలో శుద్ధీకరణ పేరుతో నిర్వహించిన కార్యక్రమాన్ని అంటరానితనానికి మరో రూపంగా అభివర్ణించారు. దీనికి బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రాహుల్ వ్యాఖ్యలపై ఫిర్యాదు.. ఎఫ్‌ఐఆర్
అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై హల్ద్వానీకి చెందిన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అమిత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ వ్యాఖ్యలు ఎస్సీ వర్గం మనోభావాలను దెబ్బతీశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆగస్టు 30న రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీస్ నిరోధక) చట్టంలోని సెక్షన్ 3(1)(r), 3(1)(u), భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 196 కింద కేసు నమోదు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీంతో హల్ద్వానీ శుద్ధీకరణ వివాదం మరో మలుపు తిరిగింది. ఒకవైపు అసలు శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండగా, మరోవైపు అదే ఘటనపై స్పందించిన రాహుల్‌పై కేసు నమోదు కావడం రాజకీయ దుమారానికి దారితీసింది.
‘‘ప్రభుత్వ హామీ ఏమైంది?’’
హల్ద్వానీ ఘటనపై రాజ్యసభలో ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా ఖర్గే తాజాగా ప్రస్తావించారు. ఆగస్టు 13న రాజ్యసభలో తాను ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు ప్రభుత్వం స్పందించిందని గుర్తుచేశారు. ఘటనపై విచారణ జరిపి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సభలో హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ హామీ అమలుపై రాజ్యసభలో ప్రభుత్వ పక్ష నేత జేపీ నడ్డాకు ఖర్గే లేఖ రాశారు. సభలో ఇచ్చిన హామీకి 24 రోజులు గడిచినా చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. రాజ్యసభలో జరిగిన పరిణామాలన్నింటినీ లేఖలో వివరించానని, నడ్డా సమాధానం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.
అప్పట్లో రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారని ఖర్గే గుర్తుచేశారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు రాహుల్ గాంధీపైనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
‘‘ఎఫ్‌ఐఆర్‌లతో గొంతు నొక్కలేరు’’
రాహుల్ గాంధీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారని ఖర్గే అన్నారు. దళితుల సమస్యలతో పాటు మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన పార్లమెంట్‌లోనూ, బయటా లేవనెత్తుతున్నారని చెప్పారు. ఇలాంటి నాయకుడిని కేసులతో భయపెట్టడం సాధ్యం కాదన్నారు.
దళితుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్ష సాధించాలనుకుంటే అది సాధ్యం కాదని ఖర్గే తేల్చిచెప్పారు. ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినా కాంగ్రెస్ చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా వాటిని ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు.
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ఆందోళనలు
రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదును నిరసిస్తూ ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. రాహుల్‌పై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో హల్ద్వానీ ర్యాలీ ప్రాంగణంలో శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరారు.








