Mahaa Daily Exclusive

  కాంగ్రెస్‌ది 30 శాతం కమిషన్ల సర్కార్‌..! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు..

Share

• అవినీతిని ప్రతిపక్షాలు చెప్పడం లేదు.
• కాంగ్రెస్‌ నేతలే బట్టబయలు చేస్తున్నారు.
• బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు.

హైదరాబాద్‌, మహా .

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి, అంతర్గత కుమ్ములాటలకు నిలయంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు తీవ్రంగా విమర్శించారు. ఇది 30 శాతం కమిషన్ల ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రతిపక్షాలు బయటపెట్టడం లేదని, స్వయంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంత్రులు, వారి కుటుంబ సభ్యులే ప్రభుత్వ అవినీతిని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారని అన్నారు.

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాంచందర్‌రావు మాట్లాడారు. మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తప్పించడం కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారమని పేర్కొన్న ఆయన.. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన నేతలు, వారి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు ప్రభుత్వ పనితీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అన్నారు. ఇది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ కాదని, కాంగ్రెస్‌ వర్గాల్లోనే అవినీతిపై విమర్శలు వస్తున్నాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, వర్గపోరు కారణంగానే ఒక్కొక్కరిగా నేతలపై వేటు పడుతోందని రాంచందర్‌రావు ఆరోపించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి చిట్టా మరింతగా బయటపడటం ఖాయమని అన్నారు.

మహిళా సాధికారత మాటల్లోనే..

మహిళా సాధికారత, పితృస్వామ్య భావజాల నిర్మూలన, మహిళల హక్కుల పరిరక్షణ అంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడుతున్నప్పటికీ.. ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని రాంచందర్‌రావు విమర్శించారు. హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటకలో మహిళలకు మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం లేదని పేర్కొన్నారు.

తెలంగాణలో ఉన్న ఇద్దరు మహిళా మంత్రుల్లో ఒకరైన కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం ద్వారా మహిళలకు కాంగ్రెస్‌ పార్టీ ఇస్తున్న గౌరవం, ప్రాధాన్యత ఏమిటో స్పష్టమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవైపు మహిళా హక్కుల గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతూనే.. మరోవైపు ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

కొండా సురేఖ చేరికపై ఊహాగానాలే

కొండా సురేఖ బీజేపీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలపై రాంచందర్‌రావు స్పందించారు. అవి కేవలం ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశారు. విమానాశ్రయంలో కొండా సురేఖతో జరిగిన భేటీ కేవలం మర్యాదపూర్వక పలకరింపు మాత్రమేనని, దానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తేల్చిచెప్పారు.

ఎవరిని బీజేపీలోకి ఆహ్వానించాలి, ఎవరిని పార్టీలో చేర్చుకోవాలన్నది పార్టీ జాతీయ నాయకత్వం పరిధిలోని అంశమని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్రస్థాయిలో వ్యక్తిగత నిర్ణయాలకు అవకాశం లేదని తెలిపారు. కొండా సురేఖ బీజేపీలో చేరుతున్నారనే ప్రచారానికి ప్రస్తుతానికి ఎలాంటి ఆధారం లేదని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.

అవినీతిపై మరింత పోరాటం

కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను ప్రజల దృష్టికి తీసుకురావడంలో బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని రాంచందర్‌రావు తెలిపారు. కాంగ్రెస్‌ అంతర్గత విభేదాలు, అవినీతి ఆరోపణలు రానున్న రోజుల్లో మరింత తీవ్ర రాజకీయ చర్చకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Latest