Mahaa Daily Exclusive

  స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి. :ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌..

Share

  •  కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలి.
  •  ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

రంపచోడవరం, మహా.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులు ఘన విజయం సాధించి సత్తా చాటాలని జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలంతా అత్యంత సమన్వయంతో క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు.
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసైనికులు, వీరమహిళలు ఎన్నో త్యాగాలు చేశారని పవన్‌ కల్యాణ్‌ గుర్తుచేశారు. వ్యక్తిగత పదవులు, రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా కూటమి విజయం కోసం నిస్వార్థంగా శ్రమించారని కొనియాడారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం దక్కాలని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పూర్తిగా గౌరవిస్తూ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కాకవాడలో ‘అడవితల్లి బాట 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఏవైనా సరే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఐక్యంగా ముందుకు సాగాలని, స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ప్రజలతో మమేకమై కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగాలంటే స్థానిక సంస్థల్లోనూ కూటమి బలపడాల్సిన అవసరం ఉందని పవన్‌ కల్యాణ్‌ ఉద్ఘాటించారు.

Latest