Mahaa Daily Exclusive

  బొల్లారం చిన్నారి హత్య కేసులో కీలక మలుపు..! కిడ్నాప్‌ వెనుక సెక్యూరిటీ సిబ్బంది కుట్ర..?

Share

సికింద్రాబాద్‌, మహా.
సికింద్రాబాద్‌ బొల్లారం పరిధిలోని విల్లాస్‌ కమ్యూనిటీలో సంచలనం సృష్టించిన చిన్నారి కిడ్నాప్‌ మరియు హత్య కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ ఉదంతంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్నారిని అపహరించి ఆమె తండ్రి నుంచి భారీగా డబ్బులు వసూలు చేయాలనే దుర్బుద్ధితోనే సెక్యూరిటీ గార్డు విక్రమ్‌ ఈ కిడ్నాప్‌ పథకానికి తెరలేపినట్లు పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. ఈ దారుణ కుట్రలో విక్రమ్‌తో పాటు మరో సెక్యూరిటీ గార్డు, ఒక ఎలక్ట్రిషియన్‌ పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల నేపథ్యంపై ఆరా తీయగా కొన్ని సంచలన విషయాలు తెలిశాయి. ఆ విల్లాస్‌ కమ్యూనిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన విక్రమ్‌ ప్రవర్తన సరిగా లేకపోవడంతో, విల్లాస్‌ అసోసియేషన్ సభ్యులు వారం రోజుల క్రితమే అతన్ని విధుల నుంచి తొలగించారు. తనను ఉద్యోగం నుంచి తీసివేయడంపై యాజమాన్యంపై, అక్కడి వారిపై కక్ష పెంచుకున్న విక్రమ్‌.. వారిని మానసికంగా కుంగదీసేందుకు వారి చిన్నారినೇ టార్గెట్ చేసుకుని అపహరణకు ప్లాన్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఘటన జరిగిన రోజు విల్లాస్‌ కమ్యూనిటీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందరూ ఆ వేడుకల్లో నిమగ్నమై ఉన్న సమయాన్ని నిందితులు తమకు అనుకూలంగా మలచుకున్నారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన మైక్ సెట్ సౌండ్‌ను, ఎలక్ట్రిషియన్ సహకారంతో భారీగా పెంచినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి అరుపులు, కేకలు ఎవరికీ వినిపించకుండా ఉండేందుకే ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ శబ్దాన్ని పెంచారా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.
చిన్నారిని కిడ్నాప్‌ చేసిన అనంతరం విక్రమ్‌ నేరుగా ఆమె తండ్రికి ఫోన్‌ చేసి భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఆ ఫోన్‌ను మరో సెక్యూరిటీ సిబ్బంది వద్ద విల్లాస్ యజమానులు గుర్తించడంతో ఈ కిడ్నాప్ డ్రామా బయటపడింది. అయితే, చిన్నారిని కిడ్నాప్ చేసిన తర్వాత బయటకు సురక్షితంగా తీసుకెళ్లడం సాధ్యం కాకపోవడం, చుట్టూ జనం ఉండటం, పోలీసులు రంగప్రవేశం చేస్తారనే తీవ్ర భయంతో విక్రమ్ ఆ చిన్నారిని అత్యంత అమానుషంగా హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని అక్కడే ఉన్న నీటి సంపులో పడేసి పరారయ్యాడు. ప్రధాన నిందితుడు విక్రమ్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
మరోవైపు, హత్యకు గురైన చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన వెంటనే మృతదేహాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి నిందితుల పూర్తి పాత్ర, కిడ్నాప్ వెనుక ఉన్న ఇతర కోణాలు, ఎవరెవరి ప్రమేయం ఉందనే అంశాలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Latest