Mahaa Daily Exclusive

  పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక ఉత్తర్వులు..! 50 శాతానికి మించరాదని స్పష్టీకరణ..

Share

అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం అత్యంత కీలక అడుగు వేసింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై స్పష్టతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 153ను అధికారికంగా విడుదల చేసింది. గతంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జారీ చేసిన జీవో 105లోని మార్గదర్శకాల్లో తగిన సవరణలు చేస్తూ ఈ తాజా ఉత్తర్వులను వెలువరించింది.
సుప్రీంకోర్టు తీర్పులు మరియు హైకోర్టు ఆదేశాలకు పూర్తిగా అనుగుణంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీని ప్రకారం గ్రామీణ స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి కేటాయించే మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం పరిమితికి మించకూడదని తేల్చిచెప్పింది.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని వాటి అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా గ్రామీణ స్థానిక సంస్థల వారీగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించింది. అలాగే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కూడా ప్రస్తుత చట్ట నిబంధనల ప్రకారమే నిర్ణయించ ہ్చాలని స్పష్టం చేసింది.
స్థానిక సంస్థల్లో సీట్లు, పదవుల కేటాయింపుతో పాటు రిజర్వేషన్ల రొటేషన్ పద్ధతిని పాటించేందుకు వీలుగా ప్రత్యేక నిబంధనలను రూపొందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ జీవో 153 అమలుకు అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం , అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు సంబంధిత ఉన్నతాధికారులకు ఉత్తర్వుల ప్రతులను పంపినట్లు సమాచారం. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

Latest