హైదరాబాద్,మహా.
హైదరాబాద్ మహానగరంలో భూగర్భ జలాల మట్టాలు వేగంగా పడిపోతుండటంతో నీటి గండం ముంచుకొస్తోంది. నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసినప్పటికీ, ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదుకాకపోవడంతో నగరంలో నీటి వనరులపై తీవ్ర ప్రభావం పడుతోంది. గతేడాదితో పోలిస్తే భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోవడం పట్ల నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పడిపోతున్న నీటి మట్టాలు.. గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
గతేడాది సెప్టెంబరు చివరి నాటితో పోలిస్తే ఈ ఏడాది అదే సమయానికి హైదరాబాద్‌లో భూగర్భ జలాల మట్టాలు సగటున 6.85 మీటర్ల మేర లోతుకు పడిపోయినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా సెప్టెంబరు నాటికి వర్షాల ద్వారా భూగర్భ జలాలు పునరుద్ధరించబడాలి. అయితే ఈ ఏడాది నైరుతి సీజన్‌లో సాధారణ వర్షపాతం లోటు కారణంగా ఆ పరిస్థితి కనిపించలేదు. హైదరాబాద్ ప్రాంతంలో సాధారణంగా నమోదు కావాల్సిన 619 మి.మీ. వర్షపగానికి గాను కేవలం 457 మి.మీ. మాత్రమే నమోదైనట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. దీనివల్ల ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబరు చివరికి నీటి మట్టాలు మరో 0.38 మీటర్లు తగ్గాయి. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో బోర్లు నీటిని అందించలేకపోతున్నాయని నివాసితులు వాపోతున్నారు.
పెరుగుతున్న ట్యాంకర్ల బుకింగ్‌లు
భూగర్భ జలాలు అడుగంటడంతో నగరంలో జలమండలి వాటర్ ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో అక్టోబరు ప్రారంభంలో రోజుకు 3,000 నుంచి 3,500 వరకు ఉండే ట్యాంకర్ల బుకింగ్‌లు, ప్రస్తుతం అమాంతం పెరిగి సగటున 5,500 నుంచి 6,000 వరకు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాలు, ఐటీ కారిడార్లు, శివారు మున్సిపాలిటీలు మరియు అపార్ట్‌మెంట్ల కమ్యూనిటీలలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా ప్రభావం పడిన ప్రాంతాలు
కూకట్‌పల్లి, అమీర్‌పేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కేపీహెచ్‌బీ, కుత్బుల్లాపూర్, సరూర్‌నగర్, జీడిమెట్ల, ఎస్సార్‌నగర్, దుండిగల్, చెంగిచెర్ల, హఫీజ్‌పేట, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాలు భారీగా తగ్గినట్లు సమాచారం. బోర్లపైనే ఆధారపడే ఇళ్లలో నీటి సమస్య తలెత్తుతుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు.
ముందస్తు చర్యల అవసరం
రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని నగరంలో నీటి వృథాను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది. భవనాలు, అపార్ట్‌మెంట్లలో వర్షపు నీటి సంరక్షణ విధిగా అమలయ్యేలా చూడాలని, ఇంకుడు గుంతల ఏర్పాటును ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు. లభ్యతలో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.








