Mahaa Daily Exclusive

  మోదీ 25 ఏళ్ల ప్రజా పాలనపై బీజేపీ నేతల అభినందనలు..! రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకారం..

Share

హైదరాబాద్‌, మహా.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో పరిపాలనాధిపతిగా అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని, తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు ఆయనకు ఘనంగా అభినందనలు తెలిపారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్ర పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ముఖ్య నేతల అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దేశ ప్రగతికి మోదీ అందిస్తున్న నిస్వార్థ సేవలను నేతలు కొనియాడారు.
ప్రజాసేవను దైవంగా భావించే ‘నాగరిక్‌ దేవో భవ’ మార్గదర్శక సూత్రాన్ని మోదీ తన పాలనలో తూచా తప్పకుండా పాటిస్తున్నారని సమావేశంలో వక్తలు ప్రశంసించారు. ప్రజల సర్వతోముఖాభివృద్ధి, దేశ సమగ్రత, పారదర్శక పాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలో పలు కీలక జాతీయ రహదారులు, రైల్వేలు, మౌలిక వసతుల కల్పన, భారీ అభివృద్ధి ప్రాజెక్టులు మరియు వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.13 లక్షల కోట్లకు పైగా నిధులను సమకూర్చిందని బీజేపీ నేతలు గుర్తుచేశారు. రాష్ట్రాలు ఆర్థికంగా ప్రగతి సాధిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందనే సహకార సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు.
మోదీ ప్రజా పాలన రజతోత్సవ సంవత్సర వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను క్షేత్రస్థాయిలోని అర్హులందరికీ చేరవేయడంలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు.
ఈ కీలక సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌, ఎంపీ డి.కె. అరుణ, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, శాసనమండలి పక్ష నేత ఏవీఎన్‌ రెడ్డి, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్‌, రాష్ట్ర కో-ఇన్‌చార్జి అభయ్‌ పాటిల్‌ తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Latest