Mahaa Daily Exclusive

  నా ఫోన్‌ను మోదీ ట్యాప్‌ చేయిస్తున్నారు….

Share

నా ఫోన్‌ను మోదీ ట్యాప్‌ చేయిస్తున్నారు.
* రాహుల్‌గాంధీ ఆరోపణ.
* ప్రధానితో బహిరంగ చర్చకు సవాల్‌.
* నిరాధార ఆరోపణలంటూ బీజేపీ కౌంటర్‌.
న్యూఢిల్లీ, మహా:
తన ఫోన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ట్యాప్‌ చేయిస్తున్నారంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. తన ఫోన్‌ నిఘాకు సంబంధించిన ఆధారాలు తన వద్దే ఉన్నాయని, ఈ విషయం ప్రధాని మోదీకి కూడా పూర్తిగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నిర్వహించిన ‘ఆస్క్‌ మీ’ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తన మొబైల్ ఫోన్‌ను చూపిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, రాహుల్‌గాంధీ ఆరోపణలను బీజేపీ నేతలు నిరాధారమైనవిగా కొట్టిపారేశారు.
ముఖాముఖి చర్చకు సిద్ధమా?
ప్రధాని మోదీతో బహిరంగ చర్చ జరగాలని రాహుల్‌గాంధీ మరోసారి సవాల్‌ విసిరారు. సుదీర్ఘ ప్రసంగాలతో కాకుండా ఇద్దరూ ఒకే వేదికపై ఎదురెదురుగా కూర్చొని పరస్పరం ఆరోపణలు, ప్రశ్నలపై చర్చించాలని ఆయన ప్రతిపాదించారు. ఈ చర్చకు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ లేదా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ న్యాయనిర్ణేతగా వ్యవహరించినా తనకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ముఖాముఖి చర్చ జరిగితే విదేశీ శక్తుల నియంత్రణలో ఎవరు ఉన్నారు, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరిస్తున్నారు అనే విషయాలు ప్రజలకు తెలుస్తాయని రాహుల్‌గాంధీ అన్నారు.
పార్లమెంటులో మాట్లాడనివ్వడం లేదంటూ విమర్శలు
పార్లమెంటులో చర్చకు బదులుగా ప్రత్యేకంగా బహిరంగ చర్చ ఎందుకు కోరుతున్నారన్న ప్రశ్నకు రాహుల్‌గాంధీ స్పందిస్తూ.. లోక్‌సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, మైక్రోఫోన్‌ కూడా నిలిపివేస్తున్నారని ఆరోపించారు. రైతు చట్టాలు, ఓట్ల చోరీ ఆరోపణలు, ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌), చైనా అంశం, మాజీ సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం. నరవణె పుస్తకం, ఎప్‌స్టీన్‌ వ్యవహారంపై తాను మాట్లాడాలనుకున్నా సభలో అవకాశం రాలేదని పేర్కొన్నారు. అందుకే ప్రధాని సమక్షంలో నేరుగా చర్చించాలని కోరుతున్నట్లు వివరించారు.
ఆధారాలు చూపాలన్న బీజేపీ నేతలు
రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై అధికార బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి బీఎల్ వర్మ మాట్లాడుతూ.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం రాహుల్‌గాంధీకి అలవాటుగా మారిందని, ఆధారాలు ఉంటే వాటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. రాహుల్‌గాంధీ ఫోన్‌ను ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని, ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. బహిరంగ చర్చ సవాల్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చర్చలకు పార్లమెంటే సరైన వేదిక అని పేర్కొన్నారు. కాగా, ఇన్‌స్టాగ్రామ్‌ కార్యక్రమంలో రాహుల్‌గాంధీ తన ఫోన్‌ చూపించినప్పటికీ, ట్యాపింగ్‌ను నిర్ధారించే సాంకేతిక ఆధారాలను బహిరంగంగా వెల్లడించలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది.