Mahaa Daily Exclusive

  ప్రపంచ సమస్యలపై హైదరాబాద్‌ వేదికగా చర్చలు….

Share

ప్రపంచ సమస్యలపై హైదరాబాద్‌ వేదికగా చర్చలు.
• భారత్‌ సమ్మిట్‌ తొలిరోజు నాలుగు కీలక అంశాలపై మేధోమథనం.
• ఫ్యూచర్‌ సిటీ, ఆర్థిక న్యాయం, సామాజిక సమానత్వం, సంక్షేమ విధానాలపై ప్రముఖుల అభిప్రాయాలు.
• రెండో రోజు రానున్న రాహుల్‌గాంధీ

హైదరాబాద్‌, మహా:

ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలపై చర్చించేందుకు హైదరాబాద్‌ వేదికగా నిర్వహిస్తున్న భారత్‌ సమ్మిట్‌–2026 రెండో ఎడిషన్‌ తొలిరోజు కార్యక్రమాలు కొనసాగాయి. ‘ఫోర్జింగ్‌ ఏ న్యూ వరల్డ్‌’ ఇతివృత్తంతో హైటెక్స్‌లో జరుగుతున్న ఈ సదస్సులో అంతర్జాతీయ పరిణామాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రపంచ దేశాల మధ్య సహకారం, కృత్రిమ మేధ, వాతావరణ మార్పులు వంటి అంశాలు ప్రధాన చర్చనీయాంశాలుగా నిలిచాయి. వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, మాజీ ప్రధానులు, మాజీ మంత్రులు, ఎంపీలు, రాయబారులు, విధాన నిర్ణేతలు, మేధావులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

తెలంగాణ రైజింగ్‌పై ప్రత్యేక చర్చలు

తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని అంతర్జాతీయ ప్రతినిధులకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్‌’ ఇతివృత్తంతో ప్రత్యేకంగా నాలుగు ప్యానల్‌ చర్చలు నిర్వహించారు. పట్టణీకరణ, ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, సంక్షేమ విధానాలపై ప్రధానంగా చర్చ సాగింది. రాష్ట్ర భవిష్యత్‌ అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పన, సామాజిక సమానత్వం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

ఫ్యూచర్‌ సిటీపై శ్రీధర్‌బాబు

పట్టణీకరణ, ఫ్యూచర్‌ సిటీ నిర్మాణంపై జరిగిన తొలి ప్యానల్‌ చర్చలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా పట్టణాలను అభివృద్ధి చేయడం, ఆధునిక మౌలిక వసతులు కల్పించడం, ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. ఫ్యూచర్‌ సిటీ నిర్మాణానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను మంత్రి వివరించారు.

ఆర్థిక, సామాజిక న్యాయంపై మేధోమథనం

ఆర్థిక న్యాయంపై జరిగిన రెండో ప్యానల్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక అసమానతలను తగ్గించడం, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు చేరేలా చూడటం, సమాన అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. సామాజిక న్యాయంపై జరిగిన మూడో చర్చలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. బీసీలతోపాటు వెనుకబడిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ, సామాజిక రంగాల్లో అవకాశాలు కల్పించాల్సిన అవసరంపై చర్చించారు.

సంక్షేమ పథకాలపై అడ్లూరి లక్ష్మణ్‌

సంక్షేమం అంశంపై జరిగిన నాలుగో ప్యానల్‌ చర్చలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. సంక్షేమ పథకాల అమలు, వాటి ద్వారా అర్హులైన వర్గాలకు ప్రయోజనాలు చేరే విధానాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

రెండో రోజు నాలుగు అంశాలపై చర్చలు

సదస్సుకు హాజరుకావాల్సిన అంతర్జాతీయ ప్రతినిధుల్లో కొందరు చివరి నిమిషంలో రాలేకపోయినట్లు నిర్వాహక వర్గాలు తెలిపాయి. రెండో రోజు కార్యక్రమాల్లో మరో నాలుగు తెలంగాణ రైజింగ్‌ అంశాలపై చర్చలు జరగనున్నాయి. సహకార సమాఖ్యవాదం, సంస్కృతి–సమాజం, యువత–క్రీడలు–రాజకీయాలు, ఎన్నికల సమగ్రత ప్రధాన చర్చాంశాలుగా ఉండనున్నాయి. ఈ అంశాలపై అంతర్జాతీయ ప్రతినిధులు తమ అనుభవాలు, అభిప్రాయాలను పంచుకోనున్నారు.

రాహుల్‌గాంధీ రాకతో రెండో రోజు కార్యక్రమాలు

రెండో రోజు కార్యక్రమాలకు కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలపై చర్చలతోపాటు తెలంగాణ అభివృద్ధి, సామాజిక విధానాలను అంతర్జాతీయ వేదికపై వివరించడంపై రెండో రోజు సమావేశాలు దృష్టి సారించనున్నాయి.