Mahaa Daily Exclusive

  మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సి.ఎస్‌. కర్ణన్‌ కన్నుమూత…

Share

మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సి.ఎస్‌. కర్ణన్‌ కన్నుమూత.
• అనారోగ్యంతో చెన్నైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస.
• కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష ఎదుర్కొన్న తొలి సిట్టింగ్‌ జడ్జిగా న్యాయ చరిత్రలో రికార్డు
చెన్నై, మహా.
మద్రాస్‌, కలకత్తా హైకోర్టుల మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సి.ఎస్‌. కర్ణన్‌ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో పలు వివాదాలు, సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచిన ఆయన.. కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు విధించిన ఆరు నెలల జైలు శిక్షతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. సిట్టింగ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఉండగానే జైలు శిక్ష అనుభవించిన తొలి వ్యక్తిగా భారత న్యాయ చరిత్రలో నిలిచారు.
న్యాయవాది నుంచి హైకోర్టు జడ్జి వరకు..
1955 జూన్‌ 12న తమిళనాడులోని కడలూరు జిల్లా కర్ణతం గ్రామంలో జన్మించిన సి.ఎస్‌. కర్ణన్‌, 1983లో మద్రాస్‌ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అనంతరం న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి పలు కేసుల్లో వాదనలు వినిపించారు. 2009 మార్చిలో మద్రాస్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన, 2011లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016 మార్చిలో కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2017 జూన్‌లో ఆయన పదవీ విరమణ చేశారు.
సుప్రీంకోర్టుతో వివాదం.. ఆరు నెలల జైలు శిక్ష
తోటి న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేయడంతో జస్టిస్‌ కర్ణన్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. 2017 జనవరిలో పలువురు ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ ఆయన ఏకంగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు ఆయనపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టింది. విచారణ సమయంలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఎస్‌. ఖేహర్‌తో పాటు ఇతర న్యాయమూర్తులపై కూడా జస్టిస్‌ కర్ణన్‌ ప్రతి ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారించిన ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం 2017 మే 9న ఆయనను కోర్టు ధిక్కరణకు దోషిగా నిర్ధారిస్తూ ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అరెస్టు వారెంట్‌ జారీ అయిన తర్వాత కొంతకాలం పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉన్న ఆయన, చివరకు జూన్‌లో కోయంబత్తూరులో అరెస్టయ్యారు. ఆరు నెలల శిక్ష పూర్తి చేసుకుని 2017 డిసెంబరులో జైలు నుంచి విడుదలయ్యారు.
వివాదాలతో సాగిన ప్రస్థానం
మద్రాస్‌ హైకోర్టులో పనిచేస్తున్న సమయంలో తనపై కుల వివక్ష, వేధింపులు జరుగుతున్నాయని జస్టిస్‌ కర్ణన్‌ బహిరంగంగా ఆరోపించారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు న్యాయమూర్తులపై ఆయన చేసిన విమర్శలు న్యాయవ్యవస్థలో తీవ్ర చర్చకు దారితీశాయి. పదవీ విరమణ అనంతరం 2020లోనూ న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఆ తర్వాత మద్రాస్‌ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. జస్టిస్‌ కర్ణన్‌ మృతి పట్ల న్యాయవాద, న్యాయవర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి. శనివారం (నవంబర్‌ 14న) కడలూరు జిల్లాలోని ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.