Mahaa Daily Exclusive

  ఆరు రాష్ట్రాల్లోని 33 చోట్ల ఏకకాలంలో సోదాలు…

Share

ఆరు రాష్ట్రాల్లోని 33 చోట్ల ఏకకాలంలో సోదాలు.
• మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌పై సీబీఐ మెరుపు దాడులు.
• లైవ్‌ బెట్టింగ్‌ ప్యానెళ్ల ధ్వంసం.
• సౌరభ్‌ చంద్రకర్‌ విచారణలో హవాలా, మ్యూల్‌ ఖాతాల గుట్టురట్టు.
దిల్లీ, మహా.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మహదేవ్‌ ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తును వేగవంతం చేసింది. అక్రమ బెట్టింగ్‌ నెట్‌వర్క్‌ మూలాలను ఛేదించే లక్ష్యంతో శనివారం ఆరు రాష్ట్రాల్లోని 33 ప్రాంతాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించింది. ఒమన్‌ నుంచి భారత్‌కు రప్పించి అరెస్టు చేసిన ఈ కేసు కీలక సూత్రధారి, యాప్‌ ప్రమోటర్‌ సౌరభ్‌ చంద్రకర్‌ విచారణలో వెల్లడించిన కీలక వివరాల ఆధారంగా ఈ సోదాలు చేపట్టినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. దిల్లీ, అమృత్‌సర్‌, నాగౌర్‌, ధోల్‌పూర్‌, భోపాల్‌, రాయ్‌పూర్‌, దుర్గ్‌, ఇండోర్‌, అహ్మదాబాద్‌, వడోదర, సూరత్‌, ముంబయి, నాగ్‌పూర్‌ తదితర నగరాల్లోని ప్యానెల్‌ ఆపరేటర్ల స్థావరాలపై బృందాలు తనిఖీలు చేపట్టాయి. పలు చోట్ల ప్రత్యక్షంగా నడుస్తున్న లైవ్‌ బెట్టింగ్‌, జూదం ప్యానెళ్లను గుర్తించి ధ్వంసం చేయడంతో పాటు వాటి కార్యకలాపాలను నిలిపివేశాయి. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో మొబైల్‌ ఫోన్లు, డిజిటల్‌ పరికరాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
మ్యూల్‌ ఖాతాల ద్వారా హవాలా దందా
బెట్టింగ్‌ ద్వారా సమకూరిన కోట్లాది రూపాయలను ఇతరుల పేర్లతో తెరిచిన లేదా అద్దెకు తీసుకున్న బ్యాంకు ఖాతాల (మ్యూల్‌ అకౌంట్లు) ద్వారా మళ్లించినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఆ ఖాతాల్లో జమ అయిన సొమ్మును, వచ్చిన లాభాలను హవాలా మార్గాల్లో విదేశాలకు తరలించినట్లు స్పష్టమైన డిజిటల్‌ ఆధారాలు లభించాయని అధికారులు వెల్లడించారు. విదేశాల్లో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న మహదేవ్‌ ఆన్‌లైన్‌ బుక్‌ యాప్‌.. దేశవ్యాప్తంగా ప్యానెల్‌ నిర్వాహకుల ద్వారా వినియోగదారులకు ప్రత్యేక ఐడీలు కేటాయిస్తూ ఈ అక్రమ దందా సాగించినట్లు గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నుంచి దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీబీఐ ఇప్పటికే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి విచారణ జరుపుతోంది.
చంద్రకర్‌ కస్టడీ విచారణతో కదిలిన డొంక
ఒమన్‌ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన సౌరభ్‌ చంద్రకర్‌ను నవంబర్‌ 1న అరెస్టు చేసిన సీబీఐ, రాయ్‌పూర్‌ ప్రత్యేక న్యాయస్థానం అనుమతితో ఎనిమిది రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకుని ప్రశ్నించింది. ఇప్పటికే సేకరించిన డిజిటల్‌ సాక్ష్యాలను ముందుంచి విచారించడంతో యాప్‌ నిర్వహణ తీరు, దేశవ్యాప్తంగా విస్తరించిన ప్యానెల్‌ నెట్‌వర్క్‌ గుట్టును అతడు బయటపెట్టాడు. కస్టడీ ముగిసిన తర్వాత నవంబర్‌ 12న కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడికి నవంబర్‌ 19 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. ఈ వ్యవహారంలో విదేశాల్లో తలదాచుకున్న ఇతర నిందితులను రప్పించేందుకు చర్యలు చేపట్టామని, బెట్టింగ్‌ కార్యకలాపాలకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగుల పాత్రపైనా లోతుగా ఆరా తీస్తున్నామని సీబీఐ స్పష్టం చేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని, ఇతరులకు తమ బ్యాంకు ఖాతాలు, సిమ్‌ కార్డులు, గుర్తింపు పత్రాలను అద్దెకు ఇచ్చినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని సీబీఐ ప్రజలను హెచ్చరించింది.