Mahaa Daily Exclusive

  ఆహార భద్రతలో భారత్‌కు ఇంకా సవాళ్లు…

Share

ఆహార భద్రతలో భారత్‌కు ఇంకా సవాళ్లు
* వంటనూనెలు, పప్పుధాన్యాల కోసం భారీగా దిగుమతులపై ఆధారపడుతున్న దేశం.
* నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ అశోక్‌ కుమార్‌ లాహిరి.

దిల్లీ, మహా:

వివిధ ఆహార ఉత్పత్తుల సరఫరా విషయంలో భారత్‌ ఇంకా పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధించలేదని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ అశోక్‌ కుమార్‌ లాహిరి పేర్కొన్నారు. ముఖ్యంగా వంటనూనెల అవసరాల కోసం భారీగా దిగుమతులపై ఆధారపడుతుండటం దేశ ఆహార భద్రతకు సవాలుగా మారుతోందని హెచ్చరించారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు కీలక ఆహార ఉత్పత్తుల సరఫరాలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

దిల్లీలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెలను దిగుమతి చేసుకుంటున్న దేశంగా భారత్‌ ఉందన్నారు. దేశ వంటనూనెల అవసరాల్లో సగానికి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయని వెల్లడించారు. ఏటా సుమారు 17 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకుంటున్నామని, ఇందుకోసం దాదాపు 20 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు.

పప్పుధాన్యాల ఉత్పత్తి, వినియోగంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని లాహిరి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే పప్పుధాన్యాల వినియోగంలో దాదాపు నాలుగో వంతు భారత్‌లోనే జరుగుతోందన్నారు. దేశంలో ఏటా సుమారు 25 నుంచి 27 మిలియన్‌ టన్నుల పప్పుధాన్యాలను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ కొన్ని రకాల పప్పుధాన్యాల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోందని చెప్పారు.

భారత్‌లో వినియోగించే శనగలు ఆస్ట్రేలియా నుంచి, మసూర్‌ పప్పు ఆస్ట్రేలియా, కెనడా నుంచి దిగుమతి అవుతున్నాయని తెలుసుకుని ఆశ్చర్యపోయానని ఆయన అన్నారు. మరికొన్ని రకాల పప్పుధాన్యాలు మయన్మార్‌, ఆఫ్రికా, రష్యా నుంచి వస్తున్నాయని వివరించారు. వంటనూనెలు, నూనెగింజలను ఇండోనేసియా, మలేసియా, అర్జెంటీనా, బ్రెజిల్‌, రష్యా, ఉక్రెయిన్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు.

విదేశాల నుంచి ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడంలో తప్పులేదని, అయితే అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో ఆటంకాలు ఏర్పడినా, ప్రపంచ మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా పెరిగినా భారత్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని లాహిరి హెచ్చరించారు.