విద్యార్థినిపై దాడి కేసు నిందితుడు హేమంత్‌కు విషమంగా ఆరోగ్యం.
* మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలింపు.
అనంతపురం, మహా.
రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై రంపపు యంత్రంతో దాడి చేసిన కేసులో నిందితుడైన హేమంత్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించింది. మెరుగైన వైద్యం అందించేందుకు అతడిని కర్నూలు ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలో 108 అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి, శుక్రవారం రాత్రి ప్రత్యేక పోలీసు ఎస్కార్ట్‌తో హేమంత్‌ను కర్నూలుకు తరలించారు.
అటవీ ప్రాంతంలో కాల్పులు.. ఆపై కుడికాలు తొలగింపు
విద్యార్థినిపై దాడికి పాల్పడిన అనంతరం హేమంత్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టిన పోలీసులకు, హేమంత్ ఆత్మకూరు అటవీ ప్రాంతంలో తలదాచుకున్నట్లు సమాచారం అందింది. అక్కడికి చేరుకుని గాలిస్తుండగా పోలీసులను చూసిన హేమంత్ కత్తితో దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడి రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే బుల్లెట్ గాయాల కారణంగా కుడికాలికి స్పర్శ కోల్పోవడంతో పాటు గ్యాంగ్రిన్ సోకినట్లు వైద్యులు గుర్తించి, మోకాలి పైభాగం వరకు కుడికాలును తొలగించారు.
కర్నూలు ఆసుపత్రి వద్ద కొనసాగనున్న నిఘా
శస్త్రచికిత్స అనంతరం అతడి ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని వైద్యులు ప్రకటించినప్పటికీ, తాజాగా పరిస్థితి మళ్లీ క్షీణించింది. ఈ నేపథ్యంలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందించేందుకు కర్నూలుకు తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తుండగా, కర్నూలు ఆసుపత్రి వద్ద కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కొనసాగించనున్నారు.








