ఒక ఏడాది ప్రయాణం..మధుర జ్ఞాపకాలు!
* హైదరాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన సజ్జనార్.
* మహేశ్ భగవత్‌కు సీపీ బాధ్యతలు.
* ఫైర్, విపత్తుల నిర్వహణ డీజీగా సజ్జనార్ బదిలీ
హైదరాబాద్, మహా:
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఏడాది కాలం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతినిచ్చిందని సీనియర్ ఐపీఎస్ అధికారి వి.సి. సజ్జనార్ పేర్కొన్నారు. నగర సీపీగా తన బాధ్యతలకు వీడ్కోలు పలుకుతూ భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఏడాది కాలంలో తనకు సహకరించిన నగర ప్రజలకు, పోలీసు సిబ్బందికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. ప్రజలు తనపై, పోలీసు వ్యవస్థపై చూపిన ఆదరాభిమానాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో గురువారం జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా సజ్జనార్‌ను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డీజీగా నియమించారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా మహేశ్ మురళీధర్ భగవత్ నియమితులయ్యారు. ఆయనకు సజ్జనార్ అభినందనలు తెలిపారు.
ప్రజల భాగస్వామ్యంతో సంస్కరణలు
తన పదవీకాలంలో పోలీసు శాఖ చేపట్టిన పలు సంస్కరణలకు నగర ప్రజలు సంపూర్ణ సహకారం అందించారని సజ్జనార్ పేర్కొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే హైదరాబాద్‌లో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార కల్తీపై ‘హెచ్-ఫాస్ట్’ కార్యక్రమం ద్వారా చర్యలు చేపట్టామని, కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకున్నామని వివరించారు.
సైబర్ నేరాలపై ఆపరేషన్ ఆక్టోపస్
సైబర్ నేరాల నియంత్రణకు ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు బ్యాంకులు, టెలికమ్యూనికేషన్ల శాఖతో సమన్వయం చేస్తూ ‘ఆపరేషన్ ఆక్టోపస్’ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్పందించి హైదరాబాద్ పోలీసుల సూచనలను స్వీకరించడం గర్వకారణమన్నారు. కేసుల దర్యాప్తును పర్యవేక్షించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ‘ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్’ను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో పోలీసుల పట్ల భయాన్ని తొలగించి, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు చేపట్టిన ‘డే విత్ సీపీ’ కార్యక్రమం ప్రత్యేక సంతృప్తినిచ్చిందన్నారు.
ట్రాఫిక్, మహిళల భద్రతకు చర్యలు
నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కేబీఆర్ పార్కు చుట్టూ వన్‌వే విధానాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఇతర అధికారుల సహకారంతో అమలు చేశామని గుర్తుచేశారు. మహిళల భద్రత కోసం ‘స్పందన’ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పోలీసు సిబ్బంది సేవలను గుర్తించి ప్రోత్సహించేందుకు ‘ఎక్స్‌ట్రా మైల్’, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ‘గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’ కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు.
పోలీసు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు
శాంతిభద్రతలు, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, సీసీఆర్‌బీ, ఎస్‌బీ, సీపీ కార్యాలయం, పరిపాలన విభాగాలతో పాటు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో కుటుంబాలను పక్కనపెట్టి విధులు నిర్వర్తించిన హోంగార్డుల నుంచి అదనపు పోలీస్ కమిషనర్ల వరకు ప్రతి ఒక్కరికీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం మార్గదర్శనం చేసిన డీజీపీ, ఉన్నతాధికారులు, తనకు సహకరించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు చెప్పారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, హైదరాబాద్ ప్రజలంతా సురక్షితంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ‘జైహింద్’తో తన సందేశాన్ని ముగించారు.








