కాలుష్యంతో భారత్‌కు రూ.25 లక్షల కోట్ల నష్టం!
* జీడీపీలో 6 శాతం ఆవిరి.
* పంటల దిగుబడి, ఉద్యోగుల ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం.
న్యూఢిల్లీ, మహా:
వాయు కాలుష్యం దేశ ప్రజల ఆరోగ్యాన్నే కాకుండా ఆర్థిక వ్యవస్థను కూడా తీవ్రంగా దెబ్బతీస్తోంది. 2024లో కాలుష్యం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు సుమారు 260 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.25 లక్షల కోట్లకు పైగా) నష్టం వాటిల్లినట్లు దాల్‌బర్గ్ అడ్వైజర్స్–క్లీన్ ఎయిర్ ఫండ్ నివేదిక వెల్లడించింది. ఇది దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 6 శాతానికి సమానమని పేర్కొంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించకపోతే ఆరోగ్యంతోపాటు ఉద్యోగాలు, వ్యవసాయం, వ్యాపార రంగాలపై ప్రభావం మరింత పెరిగే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.
ఉద్యోగుల పనితీరుపై ప్రభావం
కాలుష్యం కారణంగా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తలనొప్పి, అలసట వంటి సమస్యలు ఎదురవుతున్నా ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లి పనిచేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ విధులకు హాజరుకావడాన్ని ‘ప్రెజెంటీజం’గా పేర్కొంటారు. దీనివల్ల ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకత 8 నుంచి 10 శాతం వరకు తగ్గుతున్నట్లు నివేదిక తెలిపింది. 2019లో ప్రెజెంటీజం కారణంగా 24 బిలియన్ డాలర్లు, అనారోగ్యంతో ఉద్యోగులు సెలవులు తీసుకోవడం వల్ల మరో 6 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం సంభవించినట్లు వివరించింది. నిర్మాణ రంగ కార్మికులు, డెలివరీ సిబ్బంది, రవాణా రంగంలో పనిచేసేవారు కాలుష్య ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారు.
2019లో 16.7 లక్షల మరణాలు
వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 2019లో భారత్‌లో వాయు కాలుష్యంతో 16.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదిక పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాలుష్య ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలిపింది. తలసరి ఆర్థిక నష్టం విషయంలో దిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో ప్రజలు బయటకు వెళ్లేందుకు వెనుకాడటంతో రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, పర్యాటక రంగాల వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయి.
ఓజోన్‌తో పంట దిగుబడులకు గండి
వాయు కాలుష్యం వ్యవసాయ రంగాన్నీ వదలడం లేదు. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య వాయువులు సూర్యరశ్మితో చర్య జరిపి భూమికి సమీపంలో ఓజోన్ కాలుష్యాన్ని సృష్టిస్తాయి. ఇది వరి, గోధుమ వంటి పంటల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. 2020లో ఓజోన్ కాలుష్యం కారణంగా భారత్‌లో వరి దిగుబడి 11.46 మిలియన్ టన్నుల మేర తగ్గిందని, దీనివల్ల 2.92 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ఒక అధ్యయనం వెల్లడించింది. ఇండో–గంగా మైదాన ప్రాంతంలో గోధుమ ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గినట్లు పేర్కొంది.
దిల్లీలో తీవ్ర స్థాయికి కాలుష్యం
మరోవైపు దిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. దిల్లీ సగటు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 403కు చేరినట్లు నివేదికలో పేర్కొన్న వివరాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 59 పర్యవేక్షణ కేంద్రాల్లో 32 చోట్ల గాలి నాణ్యత తీవ్ర కేటగిరీలో నమోదైంది. ఐఐటీ దిల్లీ, చాందినీ చౌక్, నార్త్ క్యాంపస్ ప్రాంతాల్లో ఏక్యూఐ 480 దాటింది. పీఎం2.5 ధూళి కణాల సాంద్రత కూడా పెరిగి క్యూబిక్ మీటరుకు 244 మైక్రోగ్రాములకు చేరింది. వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సమస్యలున్నవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
కాలుష్య నియంత్రణకు పెట్టుబడులు అవసరం
కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల వినియోగం, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి, వ్యర్థాల సమర్థ నిర్వహణ, శుభ్రమైన వంట ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు. 2030 నాటికి పీఎం2.5 కాలుష్యాన్ని 20 శాతం తగ్గించగలిగితే 85 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని నివారించవచ్చని అంచనా. కాలుష్య నియంత్రణను ఆరోగ్య పరిరక్షణకే పరిమితం చేయకుండా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక అంశంగా చూడాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.








