Mahaa Daily Exclusive

  రాష్ట్రంలో కరువు లోవుంటే సీఎంకు సమ్మిట్లపైనే ధ్యాస…

Share

రాష్ట్రంలో కరువు లోవుంటే సీఎంకు సమ్మిట్లపైనే ధ్యాస.
• భారత్‌ సమ్మిట్‌’ ముసుగులో దేశ వ్యతిరేక శక్తులకు ఆహ్వానం.
• ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న రాహుల్‌ గాంధీ.
• మల్కాజ్‌గిరి భాజపా ఎంపీ ఈటల రాజేందర్‌.
హైదరాబాద్‌, మహా .
రాష్ట్రంలో ప్రజలు తాగునీటికి అల్లాడుతూ, రైతులు కరువు కోరల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ‘భారత్‌ సమ్మిట్‌’ పేరిట దేశ వ్యతిరేక శక్తులను, ప్రజాస్వామ్యం లేని రాచరిక దేశాల ప్రతినిధులను హైదరాబాద్‌కు పిలుచుకొస్తున్నారని మల్కాజ్‌గిరి భాజపా ఎంపీ ఈటల రాజేందర్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అల్లర్లు సృష్టించి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రలు చేసే జార్జ్‌ సోరోస్‌కు చెందిన ‘ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌’, ‘ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌’ ప్రతినిధులు, భారత్‌ను అవమానించే వ్యక్తులు రాహుల్‌ గాంధీకి మిత్రులై ఈ సదస్సులో పాల్గొంటున్నారని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఆరోపించారు. ఎన్నికలు కూడా జరగని 42 రాచరిక దేశాల ప్రతినిధులు రాహుల్‌ గాంధీకి, రేవంత్‌రెడ్డికి ఆదర్శమయ్యారా అని ఈటల సూటిగా ప్రశ్నించారు.
దేశ ప్రతిష్ఠను రాహుల్‌ దిగజారుస్తున్నారు
లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధుల ప్రాణత్యాగాలతో సాధించుకున్న భారత ప్రజాస్వామ్యాన్ని రాహుల్‌ గాంధీ విదేశీ వేదికలపై అపహాస్యం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్‌, పార్లమెంటరీ వ్యవస్థలతో పాటు దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే సైనికులను సైతం కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. గతంలో ప్రధాని పీవీ నరసింహారావు ప్రతిపక్ష నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయిని ఐక్యరాజ్యసమితికి పంపితే భారత ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని, నేడు ప్రధాని మోదీ వివిధ దేశాలకు ఎంపీల కమిటీలను పంపి దేశ కీర్తిని పెంచుతుంటే రాహుల్‌ మాత్రం దేశ పరువు తీస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో అవినీతి, కుంభకోణాలు, ఉగ్రవాద దాడులతో దేశం అల్లాడిందని.. 2014లో మోదీ ప్రధాని అయ్యాక ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడంతో పాటు అవినీతి రహిత పాలనతో భారత్‌ను ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఆర్టికల్‌ 356 ప్రయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చారని, మోదీ పాలనలో ఒక్కసారి కూడా ఆ పరిస్థితి రాలేదని ఈటల అన్నారు.
30 శాతం కమిషన్ల సర్కారు.. హైడ్రా కూల్చివేతలపై సవాల్‌
తెలంగాణలో 30 శాతం కమిషన్‌ లేనిదే ఏ పనీ జరగడం లేదని, రిటైర్మెంట్‌ ప్రయోజనాలు, చిన్న బిల్లులకు సైతం 10 నుంచి 15 శాతం కమిషన్లు వసూలు చేస్తున్నారని ఈటల ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన డిక్లరేషన్లను తుంగలో తొక్కి, హైదరాబాద్‌ భూముల దందాతో వేల కోట్ల రూపాయలను దిల్లీకి మోసుకెళ్తున్నారని విమర్శించారు. అందువల్లే ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రుణమాఫీ, రైతుబంధు వంటి పథకాలు అమలు కావడం లేదన్నారు.
జర్మనీ నియంత హిట్లర్‌ నుంచి ‘హైడ్రా’ పేరును తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, తన నియోజకవర్గ పరిధిలోని దూలపల్లి, ఫాక్స్‌ సాగర్‌ వద్ద 1995లో ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతులు, కోర్టు స్టేలు ఉన్న చిన్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయించడం దుర్మార్గమని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాక్స్‌ సాగర్‌ భూమి ఒక్క ఇంచు మునిగినా, అది పట్టా భూమి కాకపోయినా తాను ముక్కు నేలకు రాస్తానని, దీనిపై చర్చకు ముఖ్యమంత్రి సిద్ధమా అని ఆయన బహిరంగ సవాల్‌ విసిరారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్‌ విలువకు అనుగుణంగా పరిహారం చెల్లించాలని, సామాన్యుల ఇళ్ల కూల్చివేతలపై న్యాయస్థానాలు స్పందించి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్‌రెడ్డి అరాచక పాలనతో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మరో 20 ఏళ్ల పాటు కోలుకోలేదని ఈటల రాజేందర్‌ జోస్యం చెప్పారు.