పేర్లు పెడితే సరిపోదు.. హామీలు నెరవేర్చాలి.
• రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై సమీక్ష జరపండి.
• మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత తన్నీరు హరీశ్ రావు.
హైదరాబాద్, మహా .
దివంగత మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లతో పథకాలు పెడితే సరిపోదని, ఆ హామీలను నెరవేర్చినప్పుడే వారికి నిజమైన గౌరవం దక్కుతుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో శనివారం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందిస్తూ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వ మూడు బడ్జెట్ల పనితీరుపై సమీక్ష జరిపి ముఖ్యమంత్రిని లెక్క అడగాలని రాహుల్ గాంధీకి సూచించారు. హామీలు ప్రకటించడం, పాత హామీలనే మళ్లీ కొత్త బడ్జెట్‌లో తిరగబోయడం, చివరకు పైసా ఇవ్వకుండా ఎగ్గొట్టడమే రేవంత్ సర్కారు మూడు బడ్జెట్ల ఫార్ములాగా మారిందని హరీశ్ రావు విమర్శించారు.
భూమిలేని కూలీలు, నిరుద్యోగులకు నిరాశే
భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని 2024–25 బడ్జెట్‌లో ప్రకటించినా, వరుసగా మూడు బడ్జెట్లు గడిచినప్పటికీ నేటికీ వారికి ఆ సాయం అందలేదని హరీశ్ రావు ఆరోపించారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం 2025–26 బడ్జెట్‌లో ‘రాజీవ్ యువ వికాసం’ కింద రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించి, మళ్లీ 2026–27 బడ్జెట్‌లోనూ అదే అంకెను వల్లెవేశారని విమర్శించారు. బడ్జెట్ కాగితాలపై వేల కోట్ల అంకెలు కనిపిస్తున్నాయే తప్ప క్షేత్రస్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో నిరుద్యోగ యువతకు దక్కింది శూన్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జిమ్మిక్కులు కాదు.. జవాబుదారీతనం ఉండాలి
అమలుకు నోచుకోని పథకాలకు మహనీయుల పేర్లు పెట్టి ప్రజలను మోసం చేయడం వారిని అవమానించడమే అవుతుందని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. మూడు బడ్జెట్లు మారినా అవే పాత హామీలు, కాగితపు ప్రకటనలు తప్ప ప్రభుత్వానికి జవాబుదారీతనం లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదని, అవి ప్రజలకు అందేలా చూడటమూ కాంగ్రెస్ అగ్రనాయకత్వం బాధ్యతేనని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది జిమ్మిక్కులు, మోసాలు కాదని, ఇచ్చిన హామీల అమలుతో కూడిన సుపరిపాలన అని హరీశ్ రావు స్పష్టం చేశారు.








