Mahaa Daily Exclusive

  బంగాళాఖాతంలో తుపాను ముప్పు..

Share

  • బంగాళాఖాతంలో తుపాను ముప్పు
  • ఏపీ, ఒడిశాకు భారీ వర్ష సూచన!
  • 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం
  • 18, 19 తేదీల్లో అతి భారీ వర్షాలు

హైదరాబాద్, మహా : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. వాయవ్య దిశగా కదులుతున్న ఈ వాతావరణ వ్యవస్థ రానున్న 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా నవంబర్‌ 18, 19 తేదీల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని తెలిపింది. దీంతో తీర ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రానికి ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ నవంబర్‌ 15వ తేదీ ఉదయానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతరం మరింత తీవ్రరూపం దాల్చి నవంబర్‌ 16వ తేదీ సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారవచ్చని పేర్కొన్నారు. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోనూ నవంబర్‌ 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో పాటు అలల ఉద్ధృతి పెరిగే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు నవంబర్‌ 15వ తేదీలోగా సురక్షితంగా తీరానికి చేరుకోవాలని సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. నవంబర్‌ 17 వరకు అండమాన్‌ సముద్రంలో, నవంబర్‌ 15 నుంచి 18 వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో, నవంబర్‌ 16 నుంచి 19 వరకు మధ్య బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు.

ఇటీవల ‘అర్నాబ్‌’, ‘మురసు’ తుపానుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో తాజా వాతావరణ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం సూచనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తుపాను దిశ, తీవ్రత, వర్షాల ప్రభావంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.