భారత్‌పై ఎల్‌నినో పంజా.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం!
* హైరిస్క్ దేశాల జాబితాలో భారత్.
* 2027 సెప్టెంబర్ వరకు ప్రత్యేక కార్యాచరణ
ఢిల్లీ, మహా.
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు ప్రజారోగ్యానికి పెను ముప్పుగా పరిణమిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు, కరువు, అకాల వరదలు, అంటువ్యాధులతో పాటు ఆహార, తాగునీటి కొరత వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది. ఈ పరిణామాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు తన అంతర్గత అత్యవసర స్పందన స్థాయిని అత్యున్నత దశ అయిన ‘గ్రేడ్–3’కు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా 2026 అక్టోబర్ నుంచి 2027 సెప్టెంబర్ వరకు అమలయ్యేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ప్రపంచ ప్రజారోగ్య అంచనా నివేదికలో భారత్‌ను అధిక ఆరోగ్య ముప్పు ఎదుర్కొనే (హైరిస్క్) దేశాల జాబితాలో చేర్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే భారత్‌లో ఇప్పటికే గ్రేడ్–3 అత్యవసర పరిస్థితిని విధించారని కాకుండా, ఎల్‌నినో దుష్ప్రభావాలను ఎదుర్కొనేందుకు డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన ముందస్తు అత్యవసర సంసిద్ధత చర్యగా దీనిని పరిగణించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
భారత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
దక్షిణాసియా ప్రాంతంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ముఖ్యంగా రుతుపవనాలపైనే ప్రధానంగా ఆధారపడిన భారత వ్యవసాయ రంగం, తాగునీటి వనరులు, ప్రజారోగ్య వ్యవస్థలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎండల తీవ్రత పెరిగితే వడదెబ్బ, డీహైడ్రేషన్‌తో పాటు గుండె, మూత్రపిండాలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అధికమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి కొరత ఏర్పడితే పారిశుద్ధ్య సమస్యలు తలెత్తి ప్రజారోగ్యం దెబ్బతినే అవకాశం ఉన్నందున, ప్రభుత్వాలు ముందస్తు ఆరోగ్య ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించింది.
డెంగ్యూ, మలేరియా వ్యాప్తిపై హెచ్చరిక
ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో వచ్చే ఆకస్మిక మార్పులు దోమల సంతానోత్పత్తికి అనుకూలంగా మారతాయని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. నీటి కొరత కారణంగా ఇళ్లలో డ్రమ్ములు, తొట్లలో నీటిని నిల్వ చేసుకునే పరిస్థితుల్లో వాటిపై సరిగ్గా మూతలు ఉంచకపోతే దోమలు విపరీతంగా వృద్ధి చెందే ప్రమాదం ఉంది. దీనివల్ల డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు అకాల వరదలు, కలుషిత నీటి కారణంగా లెప్టోస్పిరోసిస్ సహా నీటి ద్వారా సంక్రమించే ఇతర అంటువ్యాధుల పట్ల వైద్య వ్యవస్థలు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.








