Mahaa Daily Exclusive

  ఇంటి వద్దకే అయ్యప్ప ప్రసాదాలు…..

Share

ఇంటి వద్దకే అయ్యప్ప ప్రసాదాలు.
* సన్నిధానంలో ప్రత్యేక పార్శిల్‌ కేంద్రం.
* శబరిమల భక్తులకు తపాలా శాఖ శుభవార్త.
* అరవణ, అప్పం ప్రసాదాలను నేరుగా ఇంటికి పంపించుకునే సదుపాయం.
శబరిమల,మహా.
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు భారత తపాలా శాఖ, ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు (టీడీబీ) శుభవార్త అందించాయి. దర్శనం అనంతరం భక్తులు అరవణ పాయసం, అప్పం వంటి పవిత్ర ప్రసాదాలను తిరుగు ప్రయాణంలో తమ వెంట మోసుకురావాల్సిన అవసరం లేకుండా, సన్నిధానం నుంచే నేరుగా ఇంటి చిరునామాకు పంపించుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలోనే 24 గంటల పాటు పనిచేసే ప్రత్యేక పార్శిల్‌ బుకింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా సురక్షితంగా డెలివరీ
తిరుగు ప్రయాణంలో ప్రసాదాల భారం లేకుండా భక్తులు తమకు కావాల్సినన్ని ప్యాకెట్లను సన్నిధానంలోనే బుక్‌ చేసుకునే వీలుంటుంది. ఇలా బుక్‌ చేసిన ప్రసాదాలను అత్యంత భద్రమైన ప్యాకేజింగ్‌తో స్పీడ్‌ పోస్ట్‌ పార్శిల్‌ సేవ ద్వారా దేశంలోని ఏ ప్రాంతానికైనా పంపిస్తారు. భక్తులు యాత్ర ముగించుకుని క్షేమంగా ఇంటికి చేరుకునే సమయానికి, స్వామివారి ప్రసాదాలు వారి చిరునామాకు చేరేలా తపాలా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదుపాయం కేవలం సన్నిధానానికే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల ద్వారా కూడా అయ్యప్ప ప్రసాదాలను బుక్‌ చేసుకుని తమకు కావాల్సిన చిరునామాకు తెప్పించుకునే అవకాశాన్ని కల్పించారు.
మండల యాత్ర నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు
నవంబర్‌ 17 నుంచి ప్రారంభమయ్యే 41 రోజుల మండల యాత్రా సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం ఈ సేవలను తీసుకొచ్చినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్‌, కేరళ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ అమితాబ్‌ సింగ్‌ సంయుక్తంగా వెల్లడించారు. సోమవారం (నవంబర్‌ 16) సాయంత్రం 4 గంటలకు ఆలయ తలుపులు తెరుచుకునే సమయానికే సన్నిధానంలో ఈ ప్రత్యేక పార్శిల్‌ బుకింగ్‌ కేంద్రం అందుబాటులోకి రానుంది. భక్తుల రద్దీ వేళ ప్రసాదాలను వెంట తీసుకెళ్లే ఇబ్బందులను తప్పించి, ఆధ్యాత్మిక యాత్రను మరింత సాఫీగా మార్చడమే ఈ వినూత్న సేవ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.