Mahaa Daily Exclusive

  వేలంలో సర్పంచ్ పదవి … రూ. 29 లక్షలకు పదవి దక్కించుకున్న గ్రామ నేత

Share

 

అనంతపురం, మహా : పట్టణ స్థానిక సంస్థల పోరు ముగిసిన వెంటనే గ్రామీణ స్థానిక సంస్థల పోరు మొదలవుతోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఏపీ ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఇదివరకే షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేశారు. దాంతో ఏకగ్రీవాలతో పాటు వేలం పాటలు మొదలయ్యాయి. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో ఓ పంచాయతీ సర్పంచ పదవి ఏకంగా రూ.29 లక్షలు పలికింది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం పరిధిలోని గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామంలో సర్పంచ్ పదవికి వేలంపాట నిర్వహించారు. సాధారణంగా వస్తువులు, ఇండ్లు వేలం వేస్తుంటారు. కానీ ఎన్నికల సమయంలో పదవుల వేలం జరుగుతుంటాయి. కొప్పలకొండ గ్రామంలోని రామాలయ అభివృద్ధి నిమిత్తం ఈ వేలంపాట నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. వేలంపాటలో ఎవరైతే అత్యధిక మొత్తాన్ని పాడతారో వారినే గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని గ్రామస్తులు ముందుగానే ప్రకటించారు.

కొప్పలకొండ గ్రామస్తుల ప్రకటన మేరకు నిర్వహించిన ఈ వేలంపాటలో పలువురు స్థానిక నేతలు సర్పంచ్ స్థానం కోసం పోటీ పడ్డారు. చివరకు ఎల్‌ఐసీ ఆదినారాయణ అత్యధికంగా రూ. 29 లక్షలకు వేలం పాట పాడి సర్పంచ్ పదవి దక్కించుకున్నారు. దీంతో గ్రామస్తులంతా కలిసి ఎల్‌ఐసీ ఆదినారాయణను కొప్పలకొండ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ వేలంపాట ద్వారా సమకూరిన రూ. 29 లక్షల నిధులతో గ్రామంలోని రామాలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు గ్రామస్తులు స్పష్టం చేశారు.