ఉదయం విజ్ఞప్తి.. సాయంత్రానికే ఆచరణ.
• మహేశ్ కోరిక మేరకు కుర్తా పైజామాలో రాహుల్.
• గిగ్ వర్కర్ల సభలో సరదా సంభాషణ.
• చాక్లెట్ ఇచ్చి నవ్విన రాహుల్ గాంధీ.
హైదరాబాద్, మహా.
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన కోరికను మన్నించడంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన గిగ్ వర్కర్ల సభలో కుర్తా పైజామా ధరించాలని మహేశ్ చేసిన విజ్ఞప్తిని రాహుల్ అంగీకరించారు. సాయంత్రం జరిగిన ‘భారత్ సమ్మిట్’ కార్యక్రమానికి ఆయన అదే సంప్రదాయ దుస్తుల్లో హాజరై తన మాట నిలబెట్టుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
చాక్లెట్ ఇచ్చి నవ్విన రాహుల్
హైదరాబాద్‌లో శనివారం ఉదయం గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై రాహుల్ గాంధీతో మాట్లాడిన మహేశ్‌కుమార్ గౌడ్.. ఆయన కుర్తా పైజామా ధరిస్తే చాలా బాగుంటుందని, ప్రతిరోజూ ఆ దుస్తులనే వేసుకోవాలని సరదాగా కోరారు. కుర్తా పైజామా ఎందుకని రాహుల్ ప్రశ్నించగా, ఆ దుస్తుల్లో ఎంతో హుందాగా, బాగుంటారని మహేశ్ బదులిచ్చారు. దీంతో చిరునవ్వుతో స్పందించిన రాహుల్ గాంధీ ఆయనకు చాక్లెట్ అందించారు.
బైక్ స్కిడ్ కావడంతో పరుగులు
అంతకుముందు గిగ్ వర్కర్లతో కలిసి నిర్వహించిన బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మహేశ్‌కుమార్ గౌడ్ బైక్‌పై కాకుండా కొంతదూరం పరుగెత్తుకుంటూ రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. తాను ఎక్కిన బైక్ స్కిడ్ కావడంతో మరో బైక్ ఎక్కే క్రమంలో కొంత వెనుకబడిపోయానని, తిరిగి ముందుకు వచ్చే సమయంలో పరుగెత్తానని వివరించారు. తాను ఫిట్‌గా ఉన్నానని, అందుకే రాహుల్ గాంధీ పక్కన పరుగెత్తగలిగానని సరదాగా వ్యాఖ్యానించారు. ర్యాలీలో కొంతసేపు తన పక్కన మహేశ్ కనిపించకపోవడంతో రాహుల్ గాంధీ పిలిచారని, ఈ సందర్భంగా సోనియా గాంధీ పుస్తకంపై ప్రజల్లో జరుగుతున్న చర్చతో పాటు తెలంగాణలో ఓబీసీల స్థితిగతులు, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారని మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు.








