Mahaa Daily Exclusive

  పేదలకు ఆత్మగౌరవమే ప్రభుత్వ లక్ష్యం…

Share

పేదలకు ఆత్మగౌరవమే ప్రభుత్వ లక్ష్యం.
* రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి కొత్త ‘చేయూత’ పింఛన్లు
* జిల్లాలో 33 వేలు, రఘునాథపాలెం మండలంలో 844 మందికి మంజూరు
* రైతులు వరితో పాటు ఆయిల్ పామ్, ఆరుతడి పంటల వైపు మళ్లాలి
* మంచుకొండలో పింఛన్లు, స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి తుమ్మల
ఖమ్మం, మహా.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, పేదలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.తో కలిసి ఆయన ‘చేయూత’ కొత్త పింఛన్లు, స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
వచ్చే నెల 1 నుంచే పింఛన్ల అందజేత
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో మందులు, భోజన ఖర్చుల కోసం కొడుకులు, కోడళ్లపై ఆధారపడకుండా పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతోనే పింఛన్లు ఇస్తున్నామన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేశామన్నారు. ఇందులో ఖమ్మం జిల్లాకు 33,000, రఘునాథపాలెం మండలానికి 844 పింఛన్లు దక్కాయని, వీరందరికీ వచ్చే నెల 1వ తేదీ నుంచి పింఛన్ అందుతుందని తెలిపారు. తెల్ల రేషన్ కార్డులు లేని అర్హులందరికీ స్మార్ట్ కార్డులు ఇస్తున్నామని, లబ్ధిదారులు ఆందోళన చెందకుండా గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో తమ పత్రాలు తీసుకోవాలని సూచించారు.
ఒక్కో విద్యార్థిపై రూ. 1.25 లక్షల ఖర్చు
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తుమ్మల పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీతో పాటు పేదల సంపాదన ఆసుపత్రులు, చదువుల పాలు కాకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటోందన్నారు. గురుకులాలు, త్వరలో రాబోయే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ద్వారా ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి రూ. 1.25 లక్షలు ఖర్చు చేస్తూ ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు అందిస్తోందని చెప్పారు.
వేసవిలోనూ చెరువులకు నీళ్లు.. ఆయిల్ పామ్‌తో స్థిర ఆదాయం
గతంలో వేసవి వస్తే కనీసం తాగడానికి, పశువులకు కూడా నీళ్లు లేక ఇబ్బంది పడిన రఘునాథపాలెం మండలాన్ని తిరుమలాయపాలెం తరహాలో పచ్చగా మారుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్, బుగ్గవాగు పైప్‌లైన్ ద్వారా మండలంలోని అన్ని చెరువులను నింపి భూగర్భ జలాలు పెంచుతామని, త్వరలోనే పంగిడి చెరువు కాలువ పనులు మంజూరు చేస్తామని తెలిపారు.
‘ఎల్ నినో’ ప్రభావంతో కరువు, అకాల వర్షాలు, తుఫాన్ల ముప్పు పొంచి ఉందని మంత్రి హెచ్చరించారు. ఇటీవలి తుఫాన్‌కు వరి పంటలు దెబ్బతిన్నా ఆయిల్ పామ్ తోటలకు నష్టం జరగలేదని గుర్తు చేశారు. రైతులు కేవలం వరినే నమ్ముకోకుండా శనగలు, కందులు, పెసలు, మినుములు వంటి ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. మిర్చి, కూరగాయల్లో అంతర పంటగా ఆయిల్ పామ్ వేస్తే 2.5 ఏళ్ల తర్వాత నెలా స్థిరమైన ఆదాయం వస్తుందని, పంట మార్పిడి చేసే రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఎలాంటి టార్గెట్లు లేకుండా అర్హుల ఎంపిక: కలెక్టర్
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన సుమారు 36 వేల దరఖాస్తులపై పకడ్బందీగా సర్వే నిర్వహించి, ఎలాంటి టార్గెట్లు పెట్టుకోకుండా 33 వేల మంది అర్హులను ఎంపిక చేశామని తెలిపారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన వద్దే అత్యధికంగా దివ్యాంగులకు రూ. 4,016, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ. 2,016 పింఛన్ అందిస్తున్నామన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో దరఖాస్తు చేసుకోవాలని, వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, డీఆర్డీవో కె. శ్రీరామ్, డీఎస్వో చందన్ కుమార్, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ పురందర్, ఎంపీడీవో అశోక్ కుమార్, మంచుకొండ సర్పంచ్ శంకర్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.