Mahaa Daily Exclusive

  విచారణకు రండి మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి ఈడీ నోటీసులు…!

Share

ఫార్ములా ఈ-రేసు కేసులో హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్​ను కొట్టివేసిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న కేసులో విచారణకు రావాలని కేటీఆర్​కు నోటీసులు జారీచేసింది. ఈనెల 16న ఈడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. కేటీఆర్​ను జనవరి 07న విచారణ కోసం రావాలని ఈడీ గతంలోనే కోరింది. అయితే తన క్వాష్ పిటిషన్​పై ఇవాళ తుది తీర్పు వస్తోందని, తనకు ఈరోజు కాకుండా మరింత సమయం కావాలని ఆయన ఈడీ ఈ-మెయిల్ ద్వారా లేఖను పంపారు. దీనికి ఈడీ అధికారులు కూడా సమ్మతించారు. అయితే ఈరోజు హైకోర్టులో కేటీఆర్​కు తీర్పు వ్యతిరేకంగా రావడంతో ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది.

తాజా పరిణామాలపై కేటీఆర్ ట్వీట్

తాజా పరిణామాలపై ‘ఎక్స్‌’లో కేటీఆర్‌ స్పందించారు. “నా మాటలు రాసిపెట్టుకోండి. ఈ ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం. ఈ అబద్ధాలు నన్ను దెబ్బతీయలేవు. ఈ ఆరోపణలు నన్ను తగ్గించలేవు. కుట్రలతో నా నోరు మూయించలేరు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారి తీస్తాయి. నేను న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. న్యాయం గెలుస్తుందనేది నా అచంచల విశ్వాసం. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది. నా పోరాటానికి ఈ ప్రపంచమే సాక్షిగా నిలుస్తుంది” అని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

తదుపరి కేటీఆర్ దారేటు

ఫార్ములా ఈ-రేసు కేసు విషయంలో తన క్వాష్ పిటిషన్​ను హైకోర్టు కొట్టివేయడంతో కేటీఆర్​ను ఏసీబీ అరెస్టు చేస్తుందన్న ఊహాగానాలు వస్తున్నాయి. కేటీఆర్ మళ్లీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తారా? లేదంటే హైకోర్టును కాదని సుప్రీం కోర్టుకి వెళ్తారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టులో కేవీయట్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేస్తే తమ వాదనలూ వినాలని ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరింది.