ఆదిలాబాద్, మహా
అభివద్ది పనులు, సంక్డేమ పథకాలతో ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివద్ధి చెందుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్ చౌక్ లోని అమరవీరుల స్థూపం, జయశంకర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణ లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. అనేక మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని వివరించారు. రాష్ర్టాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి రైజింగ్ -2047 విజన్ తో ముందుకు సాగుతోందని చెప్పారు. పేదల సంక్హేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహాలక్ష్మీ, ఉచిత విద్యుత్తు, గ్యాస్ రాయితీ, నిరుపేదలకు సన్నబియ్యం, ఎస్సీ వర్గీకరణ, యువతకు ఉపాధి అవకాశాలు తదితర వాటిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నార్నూర్ అస్పిరేషన్ బ్లాక్ లో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులు, ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించారు.
ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, శాసన సభ్యులు పాయల్ శంకర్, అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








