- పెళ్లి కార్డు ఇచ్చి.. పసిడి గొలుసు కొట్టేసి.
- ఆర్మూర్‌లో ‘మాయలేడి’ నయా ట్రెండ్..
- నిజామాబాద్ జిల్లాలో చైన్ స్నాచర్స్ రూటు మార్పు!
- ఇంటి తలుపు తట్టిన మృత్యుపాశం.. శుభలేఖ పేరుతో నిలువు దోపిడీ.
- ఒంటరి మహిళలే టార్గెట్‌గా కేటుగాళ్ల కొత్త స్కెచ్.
- ఆర్మూర్‌లో మూడున్నర తులాల చైన్ మాయం..
ఆర్మూర్,మహా.
బంగారం ధరలు రోజురోజుకూ సెంచరీ దాటి పరుగులు తీస్తుంటే.. అదే స్థాయిలో దొంగలు కూడా తమ తెలివితేటలకు పదును పెడుతున్నారు. ఇప్పటి వరకు బైకులపై వచ్చి మెడలో గొలుసులు తెంచుకుపోయే సీన్లు చూశాం. కానీ, ఇప్పుడు పద్ధతి మారింది. రూటు మారింది. ఏకంగా ఆడవాళ్లనే రంగంలోకి దించి, ‘శుభలేఖ’ పేరుతో ఇంటి గుమ్మం దగ్గరికే వచ్చి దోపిడీలకు తెగబడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ సమీపంలోని పెర్కిట్ గ్రామంలో తాజాగా వెలుగు చూసిన ఈ ‘వెడ్డింగ్ కార్డ్ స్నాచింగ్’ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ గ్రామానికి చెందిన దీపిక, చంద్రశేఖర్ దంపతుల ఇంట్లో జరిగిన ఈ ఘటన సినిమా ఫక్కీలో సాగింది. చంద్రశేఖర్ నిత్యావసర సరుకుల కోసం బయటకు వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకున్న ఒక ‘మాయలేడి’ పక్కా స్కెచ్‌తో రంగంలోకి దిగింది. సుమారు 40 నుండి 50 ఏళ్ల వయసు ఉండి, పచ్చ రంగు చీర కట్టుకున్న ఆ మహిళ చేతిలో పెళ్లి పత్రికలతో దీపిక ఇంటి తలుపు తట్టింది. “పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చామమ్మా.. ఇంట్లో ఎవరూ లేరా?” అంటూ నమ్మబలికింది. కార్డు తీసుకోవడానికి దీపిక తలుపు తీసి బయటకు రాగానే, ఆ మాయలేడి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. పత్రిక ఇస్తున్నట్లు నటిస్తూనే, చేతిలో ఉన్న ఏదో బరువైన వస్తువుతో దీపిక తలపై బలంగా కొట్టింది. ఆ దెబ్బకు దీపిక అక్కడికక్కడే స్పృహ కోల్పోగా, నిందితురాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని క్షణాల్లో మాయమైపోయింది.
కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన చంద్రశేఖర్, తన భార్య గడప ముందర అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి హతాశయుడయ్యాడు. మొదట ఏదో అనారోగ్యం వల్ల పడిపోయిందేమోనని కంగారుగా ఆసుపత్రికి తరలించాడు. దాదాపు అరగంట తర్వాత స్పృహలోకి వచ్చిన దీపిక, తన మెడలో గొలుసు లేకపోవడం చూసి షాక్‌కు గురైంది. జరిగిన విషయాన్ని భర్తకు వివరించడంతో అసలు దోపిడీ గుట్టు రట్టయింది. సుమారు 6 లక్షల రూపాయల విలువైన బంగారు గొలుసును ఆ మహిళా దొంగ అత్యంత చాకచక్యంగా ఎత్తుకెళ్లిపోయింది. ఈ తరహాలో ఒక మహిళ వచ్చి తలపై కొట్టి గొలుసు లాక్కెళ్లడం ఆర్మూర్ ప్రాంతంలో ఇదే మొదటిసారి కావడంతో స్థానిక మహిళలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు.
ఈ వినూత్న చోరీపై నిజామాబాద్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఆర్మూర్ పట్టణంలోని సిసిటివి కెమెరాలను జల్లెడ పడుతూ, పచ్చ రంగు చీర కట్టుకున్న ఆ మహిళ కోసం గాలింపు ముమ్మరం చేశారు. కేవలం గొలుసు తెంచుకోవడమే కాకుండా, బాధితురాలు స్పృహ కోల్పోయేలా తలపై దాడి చేయడం చూస్తుంటే ఇదో ప్రొఫెషనల్ గ్యాంగ్ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వేసవి కాలం కావడంతో మహిళలు ఒంటిపై బంగారు ఆభరణాలు ఎక్కువగా ధరిస్తుంటారని, ఇదే దొంగలకు వరంగా మారుతోందని అధికారులు విశ్లేషిస్తున్నారు. అపరిచితులు ఎవరు వచ్చినా, పెళ్లి పత్రికలు లేదా సేల్స్ మెన్ల పేరుతో తలుపులు తీయమని కోరినా అప్రమత్తంగా ఉండాలని, తలుపుల వెనుక నుండే మాట్లాడాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒంటరి మహిళలు ఉన్న ఇళ్లపై ఈ మాయలేడి గ్యాంగులు కన్నేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో ఆర్మూర్ పోలీసులు నిఘా పెంచారు. పాత నేరస్థుల రికార్డులను పరిశీలిస్తూనే, కొత్తగా మహిళా స్నాచర్లు ఎవరైనా రంగంలోకి దిగారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.








