- కెసిఆర్ ఎక్కడున్నావ్?
- గజ్వేల్ గడప తొక్కి ఎన్ని ఏళ్లయ్యింది?
- ప్రజల కష్టాలు వినవు.. కేవలం సంతకం పెట్టి పోవడానికేనా ఎమ్మెల్యే పదవి?
• నెలకు రూ. 2 కోట్ల ప్రజాధనం వృధా..
• ఫామ్ హౌస్ కే పరిమితమైతే ఆ హోదా ఎందుకు?
• రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న కెసిఆర్.. దొంగచాటుగా సంతకాలు పెట్టి పారిపోతున్నారా?
• బీజేపీ అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ నిప్పులు!
• కెసిఆర్ కు బీజేపీ బహిరంగ లేఖ.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు తమ కర్తవ్యాలను విస్మరించి ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ప్రజా సమస్యలను గాలికొదిలేశారని ఆయన ధ్వజమెత్తారు. శుక్రవారం హైద్రాబాద్ బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్, తన ప్రాంత ప్రజలను కలవకపోవడం, వారి ఇబ్బందులను అసెంబ్లీలో ప్రస్తావించకపోవడం ఆయన విధి నిర్వహణలో విఫలమైనట్టు స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు ఈ మేరకు కేసీఆర్ కు కొన్ని సూటి ప్రశ్నలతో కూడిన ఒక ‘బహిరంగ లేఖ’ను బీజేపీ తరఫున విడుదల చేస్తున్నట్లు ప్రసాద్ రావు ప్రకటించారు.
గత 15 ఏళ్లుగా గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి బిజీ కారణాలు చెప్పి ప్రజలకు దూరంగా ఉన్నారని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సరే అదే తీరును కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన కలెక్టరేట్‌కు వెళ్లరు, స్థానిక అధికారులతో మాట్లాడరు, ప్రజల సమస్యలను పట్టించుకోరు అని నిలదీశారు.మల్లన్న సాగర్ ముంపు బాధితులకు సరైన న్యాయం చేయలేకపోయారని, వారు గజ్వేల్‌లో ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.గజ్వేల్ పట్టణంలో 5000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ గాలి మాటలుగానే మిగిలిపోయిందని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పేరుతో రూ. 125 కోట్లు దుర్వినియోగం అయ్యాయని విమర్శించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం ఏదైనా సభ్యుడు 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆ స్థానాన్ని ఖాళీగా ప్రకటించే అవకాశం ఉంటుందని, ఆ నిబంధన నుండి తప్పించుకోవడానికి కేసీఆర్ దొంగచాటుగా వచ్చి కేవలం సంతకం పెట్టి వెళ్లిపోతున్నారని ప్రసాద్ రావు ఎద్దేవా చేశారు . పదవిని కాపాడుకోవడానికి పడే ఈ కక్కుర్తిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 90 ఏళ్ల వయసులోనూ మాజీ ప్రధాని దేవెగౌడ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతుంటే, కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ కే పరిమితం కావడం ప్రజలను అవమానించడమేనన్నారు. కేసీఆర్ కు ఉన్న జెడ్ ప్లస్ భద్రత, వ్యక్తిగత సిబ్బంది, ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వం నుంచి నెలకు సుమారు రెండు కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని, ఇది ప్రజల సొమ్ము అని గుర్తు చేశారు.
గజ్వేల్ పట్టణంలో రోడ్ల విస్తరణ పేరుతో వందలాది ఇళ్లను కూలగొట్టి నష్టపరిహారం ఇవ్వలేదని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి కాలేదని, బస్ స్టాండ్ నిర్మాణం ఊరికి దూరంగా కట్టి ప్రజాధనం వృధా చేశారని ఆయన నివేదించారు.గతంలో మొక్కలు ఎండిపోయాయని సర్పంచులను సస్పెండ్ చేసిన కేసీఆర్, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా విధులకు హాజరు కాకుండా జీతం తీసుకుంటున్న మీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, బీజేపీ మాత్రమే అసలైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ మేల్కొని అసెంబ్లీకి వచ్చి గజ్వేల్ ప్రజల వాణిని వినిపించాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో గజ్వేల్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.








