Mahaa Daily Exclusive

  ఆస్తి పిచ్చితో అగ్నిప్రళయం..! కన్నతండ్రి, పిన్నిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన కిరాతక పుత్రుడు..!

Share

  •  అర్థరాత్రి అగ్నిగుండంగా మారిన ఇల్లు.
  •  వికారాబాద్ తండాలో సజీవదహనం కుట్ర.
  •  5 లక్షల రైతు బీమా డబ్బు కోసం నరరూప రాక్షసుడి స్కెచ్.
  •  ఆస్తి కోసం నలుగురిని బలితీసుకోబోయిన అనార్ సింగ్ ఘాతుకం.
  •   40 లీటర్ల పెట్రోల్.. బయట నుంచి గడియ.. అర్థరాత్రి చావుతో పోరాటం.
  •   నిశ్చితార్థం జరిగిన తమ్ముడిపై పగతో దాడి!

వికారాబాద్,మహా.

అర్థరాత్రి వేళ ఆదమరిచి నిద్రపోతున్న ఆ కుటుంబానికి మృత్యువు పెట్రోల్ వాసనతో పలకరించింది. చుట్టూ చిమ్మచీకటి.. లోపల నిమ్మళంగా నిద్రపోతున్న తండ్రి, పిన్ని, తమ్ముళ్లు. కానీ, కన్నకొడుకు రూపంలో ఉన్న ఓ రాక్షసుడు మాత్రం ఆ ఇంటిని స్మశానంగా మార్చాలని కంకణం కట్టుకున్నాడు. ఆస్తి కోసం కన్నప్రేమను చంపుకుని, తల్లి ప్రాణం పోతే వచ్చిన ‘రైతు బీమా’ సొమ్ము కోసం ఏకంగా కుటుంబాన్నే అగ్నికీలలకు అప్పగించాడు. బయట నుంచి గడియపెట్టి, పైకప్పు రంధ్రం గుండా లీటర్ల కొద్దీ పెట్రోల్ గుమ్మరించి నిప్పు రాజేసిన ఆ కిరాతకుడి ఉదంతం ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెను సంచలనం సృష్టిస్తోంది. ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటల మధ్య ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ కుటుంబం చేసిన హాహాకారాలు ఆ తండా వాసులను కలిచివేస్తున్నాయి.

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్‌సింగ్ తండాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వెనుక ఆస్తి దాహం, కక్షాకార్పణ్యం దాగి ఉన్నాయి. నేనావత్ హన్మంత్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు కాగా, మొదటి భార్య కుమారుడు అనార్ సింగ్ తన తండ్రిపై పగ పెంచుకున్నాడు. ఐదు నెలల క్రితం అనార్ సింగ్ తల్లి నాతిబాయి అనారోగ్యంతో చనిపోగా, ఆమె పేరు మీద వచ్చిన రూ. 5 లక్షల రైతు బీమా సొమ్ముపై ఈ కిరాతకుడి కన్ను పడింది. ఆ డబ్బుతో పాటు ఉన్న భూమిలో సింహభాగం తనకే కావాలని, లేనిపక్షంలో తండ్రిని, చిన్న భార్య రమణిబాయిని (ప్రస్తుత సర్పంచ్), ఆమె కుమారులను హతమార్చాలని పథకం వేశాడు. ఇప్పటికే ఒక ఎకరం భూమిని తండ్రి తన పేరున రాసిచ్చినా, మిగిలిన ఆస్తి మొత్తం చిన్న భార్య పిల్లలకే వెళ్తుందన్న భయంతో అమానవీయమైన నిర్ణయం తీసుకున్నాడు. తండ్రీకొడుకుల మధ్య ఈ విషయంలో గతంలోనే పోలీసు కేసులు కూడా నడవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

పథకం ప్రకారం బుధవారం అర్థరాత్రి వేళ అనార్ సింగ్ ఆ ఇంటిపై పడ్డాడు. లోపల అందరూ నిద్రపోతున్నారని నిర్ధారించుకున్నాక, ఎవరూ బయటకు రాకుండా తలుపులకు గడియపెట్టాడు. ఇంటి పైకప్పులో ఉన్న రంధ్రం ద్వారా ఏకంగా 40 లీటర్ల పెట్రోల్, డీజిల్‌ను లోపలికి గుమ్మరించాడు. క్షణాల వ్యవధిలో నిప్పు రాజేయడంతో ఇళ్లంతా అగ్నిగుండంగా మారిపోయింది. గాఢ నిద్రలో ఉన్న హన్మంతు, రమణిబాయి, వారి కుమారులు వెంకటేష్, శివ మంటల తాకిడికి దిగ్భ్రాంతితో లేచారు. బయటకు వెళ్దామంటే తలుపులు రాకపోవడంతో ఆ భయానక వాతావరణంలో వారు ఆర్తనాదాలు చేశారు. మంటల్లో శరీరం కాలిపోతున్నా తప్పించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండగా, అలికిడి విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి వారిని బయటకు తీశారు. అప్పటికే రమణిబాయి, వెంకటేష్‌లు 90 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయారు.

ఈ ఘాతుకంలో వెంకటేష్ అనే యువకుడి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అతనికి ఇటీవలే నిశ్చితార్థం జరిగి పెళ్లికి సిద్ధమవుతుండగా, సొంత అన్నయ్యే ఇలా నిప్పు పెట్టడం ఆ తండాలో విషాదం నింపింది. గాయపడిన వారిని హైదరాబాద్‌లోని డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ మరియు పోలీసులు కేసును వేగంగా విచారించి, నిందితుడు అనార్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి కోసం ఒకేసారి నలుగురిని సజీవదహనం చేసేందుకు ప్రయత్నించిన నిందితుడిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Latest