Mahaa Daily Exclusive

  ఇక్కడ వ్యాపారం.. అక్కడ సేవలా..? సీఎస్ఆర్ నిధుల వేటలో రేవంత్ సర్కార్..

Share

  • సగం నిధులు ఇక్కడే ఖర్చు పెట్టాల్సిందే!
  • దాతృత్వంలోనూ దగానా?
  • కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీకి కొత్త ‘రూట్’.
  •  సీఎస్ఆర్ నిధుల వేటలో రేవంత్ సర్కార్.
  •  ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనానికి ఆదేశాలు!
  • లాభాలు తెలంగాణకు.. సేవలు పొరుగు రాష్ట్రాలకా?
  •  కార్పొరేట్ మాయాజాలానికి చెక్ పెడుతూ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం!
  • కార్పొరేట్ కంపెనీల తీరుపై సీఎం రేవంత్ ఫైర్.
  •   సీఎస్ఆర్ నిధులపై సర్కార్ కొరడా!
  • శాసనమండలి సాక్షిగా దిగ్గజ కంపెనీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్టిమేటం.
  • రాష్ట్ర నిధుల దారి మళ్లింపుపై సీఎం సీరియస్.
  • పారదర్శకత కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటుకు ఆదేశం.

 

హైదరాబాద్, మహా.

 

**తెలంగాణ గడ్డపై పరిశ్రమలు స్థాపిస్తారు…ఇక్కడి వనరులను వాడుకుంటారు.. కోట్లకు కోట్లు లాభాలు గడిస్తారు.. కానీ, సమాజానికి తిరిగి ఇచ్చే ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ (సీఎస్ఆర్) నిధుల విషయానికి వచ్చేసరికి మాత్రం పొరుగు రాష్ట్రాల వైపు చూస్తారు! దశాబ్దాలుగా కార్పొరేట్ కంపెనీలు ఆడుతున్న ఈ దోబూచులాటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చెక్ పెట్టబోతోంది. రాష్ట్రంలో కంపెనీలు నడుపుతూ, ఇక్కడి ప్రజల సమస్యలను గాలికొదిలేసి వేరే రాష్ట్రాల్లో దాతృత్వం ప్రదర్శించడం ఏంటని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. శాసనమండలి వేదికగా సీఎస్ఆర్ నిధుల వినియోగంపై సమీక్ష నిర్వహించిన ఆయన, ఇకపై కంపెనీలు కనీసం సగం నిధులను తెలంగాణలోనే ఖర్చు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది**

 

తెలంగాణ ఇప్పుడు విశ్వనగరంగా, గ్లోబల్ పెట్టుబడుల హబ్‌గా ఎదుగుతోంది. వేలాది జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయి. నిబంధనల ప్రకారం ప్రతి లాభదాయక కంపెనీ తమ లాభాల్లో కొంత శాతాన్ని సామాజిక బాధ్యత కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, చాలా కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలు వేరే రాష్ట్రాల్లో ఉండటం వల్లనో, లేక యాజమాన్యాల వ్యక్తిగత ఆసక్తుల వల్లనో తెలంగాణలో పుట్టిన సీఎస్ఆర్ నిధులను ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నాయనే పచ్చి నిజాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టబయలు చేశారు. ఇక్కడి మౌలిక సదుపాయాలను వాడుకుని లాభపడుతున్నప్పుడు, తిరిగి ఇక్కడి పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రామీణాభివృద్ధి కోసమే ఆ నిధులను వెచ్చించడం నైతిక బాధ్యత అని ఆయన తేల్చి చెప్పారు. శాసనమండలిలో అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు.

ఈ నిధుల మళ్లింపును అరికట్టేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి కంపెనీ తమ సీఎస్ఆర్ నిధుల్లో కచ్చితంగా 50 శాతం మొత్తాన్ని తెలంగాణలోనే ఖర్చు చేయాలనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను, ఒక డెడికేటెడ్ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ కంపెనీకి ఎంత లాభం వచ్చింది? అందులో సీఎస్ఆర్ కింద ఎంత కేటాయించారు? ఆ నిధులను రాష్ట్రంలో ఏయే ప్రాజెక్టులకు ఖర్చు చేశారు? అనే వివరాలన్నీ ఈ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా కార్పొరేట్ల జవాబుదారీతనాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు, సీఎస్ఆర్ నిధులను రాష్ట్రానికి భారీగా రాబట్టేందుకు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయాలని కూడా రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు సీఎస్ఆర్ నిధులను తమ రాష్ట్ర అభివృద్ధి పనులతో ఎలా అనుసంధానం చేసుకుంటున్నాయో పరిశీలించి, మన దగ్గర కూడా ఒక పటిష్టమైన విధానాన్ని (పాలసీ) తీసుకురావాలని యోచిస్తున్నారు. ఈ నిధులను ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలైన విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలకు మళ్లించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారాన్ని తగ్గించవచ్చని సీఎం భావిస్తున్నారు. మొత్తానికి, దాతృత్వం ముసుగులో జరుగుతున్న నిధుల దారిమళ్లింపు వ్యవహారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన బ్రేకులు, తెలంగాణ సామాజిక అభివృద్ధికి కొత్త ఊపిరి పోయనున్నాయి.

Latest