- సామాన్యుడి చెంతకే ‘ప్రజావాణి’.
- తెలంగాణలో సరికొత్తగా ‘ప్రజా సూచన పోర్టల్.
- సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.
హైదరాబాద్, మహా.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో రాష్ట్ర స్థాయిలో విజయవంతంగా అమలవుతున్న ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఇకపై మరింత కింది స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తమ చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం మారుమూల గ్రామాల నుంచి ప్రజలు రాజధాని హైదరాబాద్ వరకు వ్యయప్రయాసలకోర్చి రానవసరం లేకుండా, స్థానికంగా ‘రెవెన్యూ డివిజన్’ స్థాయిలోనే ప్రజావాణిని నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
గురువారం శాసనమండలి సమావేశ హాలులో ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో సీఎం ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర స్థాయికే పరిమితమైన ప్రజావాణిని వికేంద్రీకరించడం ద్వారా అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు వంటి స్థానిక సమస్యలు ఏ డివిజన్‌కు ఆ డివిజన్‌లోనే సత్వరం పరిష్కారం అయ్యేలా కలెక్టర్లు, ఆర్డీవోల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న దూరం భారీగా తగ్గనుంది.
సమాచార హక్కును మరింత బలోపేతం చేస్తూ, రాజస్థాన్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న “జన్ సూచన పోర్టల్” తరహాలో తెలంగాణలోనూ ‘ప్రజా సూచన పోర్టల్’ను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలు, వాటి అర్హతలు, లబ్ధిదారుల వివరాలు, దరఖాస్తు విధానం వంటి సమగ్ర సమాచారం మొత్తం ఒకే ప్లాట్‌ఫామ్ మీద ప్రజలకు అందుబాటులో ఉంచడమే ఈ పోర్టల్ ప్రధాన ఉద్దేశం. ఈ బాధ్యతను ఐటీ శాఖకు అప్పగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల ప్రభుత్వ పథకాల్లో దళారుల వ్యవస్థకు చెక్ పడుతుంది.
**చారిత్రాత్మక గిగ్ వర్కర్స్ బిల్లుపై ప్రశంసలు**
క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఈ-కామర్స్ డెలివరీ వర్కర్స్ (గిగ్ వర్కర్లు) సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతున్న ‘గిగ్ వర్కర్స్ బిల్లు’పై సామాజిక కార్యకర్త నిఖిల్ డే ప్రశంసల వర్షం కురిపించారు. అసంఘటిత రంగంలో ఎలాంటి భద్రతా లేకుండా పనిచేస్తున్న లక్షలాది మంది యువతకు ఈ చట్టం ఎంతో భరోసానిస్తుందని, ఇది దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొని ఈ నూతన విధానాల అమలుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మొత్తానికి, పారదర్శకత మరియు జవాబుదారీతనం అనే రెండు చక్రాలపై రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతోందని ఈ సమావేశం ద్వారా స్పష్టమైంది.








