- వెలుగుమట్ల భూదాన్ వివాదంలో కీలక మలుపు.
- ఇళ్ల కూల్చివేతలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ!
- పిటిషనర్లకు చుక్కెదురు.. సీసీఎల్ఏ ఉత్తర్వుల అమలుకే గ్రీన్ సిగ్నల్.
- తదుపరి విచారణ ఏప్రిల్ 15కు వాయిదా!
హైదరాబాద్, మహా.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదంలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్ల కూల్చివేతలను న్యాయస్థానం ద్వారా అడ్డుకోవాలని ఆశించిన పిటిషనర్లకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో తీవ్ర చుక్కెదురైంది. వెలుగుమట్ల పరిధిలో రెవెన్యూ అధికారులు చేపడుతున్న ఇళ్ల కూల్చివేతలపై ఎట్టి పరిస్థితుల్లోనూ స్టే మంజూరు చేయలేమని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. భూదాన్ భూముల వ్యవహారంలో సీసీఎల్ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ బాధితులు ఏకంగా 23 పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేశారు. అయితే, ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటిషనర్లు ఆశించిన విధంగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేయడం స్థానికంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ వాదనలు న్యాయస్థానాన్ని ఏకీభవించేలా చేశాయి. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది (జీపీ) మురళీధర్‌రెడ్డి కోర్టుకు కీలక విషయాలను విన్నవించారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇప్పటికే అర్హులైన పేదలను గుర్తించి, అత్యంత పారదర్శకంగా పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేసిందని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 311 మంది నిరుపేదలకు, అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలను సైతం అందజేశామని, ఇంకా మరికొన్ని దరఖాస్తులు ప్రభుత్వ పరిశీలన దశలో ఉన్నాయని వివరించారు. అనర్హుల ఆక్రమణలను తొలగించి, నిజమైన అర్హులకు ఆ భూములను పంచుతున్న క్రమంలో న్యాయపరమైన అడ్డంకులు సృష్టించడం సరికాదన్న ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించింది.
ప్రభుత్వం ఒకవైపు పేదలకు పట్టాలు పంపిణీ చేస్తున్న అత్యంత కీలకమైన దశలో, ఆ ప్రక్రియకు ఆటంకం కలిగించేలా ఇప్పుడు స్టే ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రజా సంక్షేమం దృష్ట్యా జరుగుతున్న ఈ కార్యకలాపాలకు బ్రేకులు వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని ప్రకటిస్తూ పిటిషన్లను తోసిపుచ్చింది. అయితే, ఈ వ్యవహారంపై ఇరుపక్షాల వాదనలను మరింత లోతుగా వినేందుకు, అలాగే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనపై స్పష్టత కోసం తదుపరి విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు తాజా నిర్ణయంతో వెలుగుమట్లలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియకు న్యాయపరమైన అడ్డంకులు తాత్కాలికంగా తొలగిపోయినట్లయింది.








