- కడియం శ్రీహరి, సంజయ్ కుమార్‌లకు హైకోర్టు సంచలన నోటీసులు!
- అనర్హత పిటిషన్లపై చర్యలేవి? ఏప్రిల్ 16కు విచారణ వాయిదా.
హైద్రాబాద్, మహా.
తెలంగాణలో అధికార మార్పిడి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన కీలక నేతలు కడియం శ్రీహరి, సంజయ్ కుమార్‌ల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి చేరింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఏకంగా స్పీకర్ ట్రైబ్యునల్‌తో పాటు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
గురువారం ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ (సీజే) ధర్మాసనం కీలక విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు ధర్మాసనం ముందు తమ వాదనలను బలంగా వినిపించారు. చట్టసభల సాక్షిగా పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలపై స్పీకర్ ట్రైబ్యునల్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, ఫిర్యాదులను ఉద్దేశపూర్వకంగానే పెండింగ్‌లో పెడుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేలా వెంటనే కడియం, సంజయ్‌లపై అనర్హత వేటు వేసేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్న తీరును వారు న్యాయమూర్తుల ముందు కుండబద్దలు కొట్టారు.
ఇరువర్గాల ప్రాథమిక వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. ప్రతివాదుల వివరణ లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని భావించిన న్యాయస్థానం.. వెంటనే శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్‌కు, అలాగే పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్ కుమార్‌లకు అధికారికంగా నోటీసులు జారీ చేసింది. అనర్హత పిటిషన్లపై తీసుకున్న చర్యల గురించి, జాప్యానికి గల కారణాల గురించి కోర్టుకు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు తాజా నిర్ణయంతో కాంగ్రెస్‌లో చేరిన వలస నేతల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.








