- ఆ క్షణం చనిపోవాలనుకున్న
- డ్రగ్స్ కేసులో తీవ్రంగా మానసికంగా కుంగిపోయాను
- ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మీట్ ది ప్రెస్ లో ప్రముఖ నటి హేమ
హైదరాబాద్, మహా : డ్రగ్స్ కేసు, దాని వల్ల తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు, మీడియా పాత్ర వంటి అంశాలపై సినీ నటి హేమ భావోద్వేగంగా స్పందించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో నటి హేమ మాట్లాడుతూ డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు తనను తీవ్రంగా మానసికంగా కలచివేశాయని చెప్పారు. “ఆ సమయంలో నేను చచ్చిపోవాలనిపించింది. అంతగా మానసికంగా కుంగిపోయాను” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చానని స్పష్టం చేశారు.
డ్రగ్స్ వ్యవహారంలో కొందరు మీడియా సంస్థలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ బురదజల్లాయని ఆమె ఆరోపించారు. ఆ వార్తల కారణంగా తన వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా బాధపడ్డారని చెప్పారు. “నా కుటుంబం చాలా సఫర్ అయింది. మాకు ఇది చాలా కఠినమైన కాలం” అని ఆమె పేర్కొన్నారు. అయితే మొత్తం మీడియాను ఒకే తాటిపై వేయలేమని, నిజాయితీగా వ్యవహరించే మీడియా సంస్థలు తనకు మద్దతుగా నిలుస్తాయని తాను నమ్ముతున్నానని హేమ తెలిపారు. భవిష్యత్తులో కూడా మీడియా తనకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.







