Mahaa Daily Exclusive

  భక్తిపారవశ్యంలో విజయవాడ….

Share

భక్తిపారవశ్యంలో విజయవాడ.
* చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా వైభవంగా ఆంజనేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ.
* హనుమాన్ దీక్షా పీఠంలో కనులపండువగా కుంభాభిషేక మహోత్సవం.
*పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు.. స్వామివారికి ప్రత్యేక పూజలు.

విజయవాడ, మహా.
కనకదుర్గమ్మ కొలువైన విజయవాడ నగరం ఆధ్యాత్మిక శోభతో పునీతమైంది. అఖిల భారత హనుమాన్ దీక్షా పీఠంలో ఆంజనేయ స్వామి ఆలయ జీర్ణోద్ధారణ, పునఃప్రతిష్ఠ, కుంభాభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. హనుమాన్ మాల రూపకర్త శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహత్తర ఘట్టం, పరమ పూజ్యశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి దివ్య హస్తాల మీదుగా శాస్త్రోక్తంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర వేడుకలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీశ్ రావు పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇరువురు పీఠాధిపతుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం భక్తుల జయజయధ్వానాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆధ్యాత్మిక ఉత్సాహంతో సాగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రసంగిస్తూ, హనుమాన్ జయంతి వంటి పవిత్ర పర్వదినాన, ఇద్దరు మహోన్నత పీఠాధిపతుల సమక్షంలో ఈ పుణ్యకార్యంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ధర్మ పరిరక్షణ కోసం ఎక్కడ నూతన దేవాలయాలు నిర్మించినా, పురాతన ఆలయాల జీర్ణోద్ధారణ జరిగినా అక్కడ చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులు, ఉనికి ఉండటం ఆయా ప్రాంతాల ప్రజల అదృష్టమని ఆయన కొనియాడారు. గతంలో తమ స్వగ్రామంలో చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాణప్రతిష్ఠ కూడా స్వామివారి స్వహస్తాల మీదుగానే జరగడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. కేవలం ఆధ్యాత్మికతే కాకుండా, సమాజంలో సమానత్వం వెల్లివిరియాలనే సంకల్పంతో హైదరాబాద్‌ గడ్డపై చిన్నజీయర్ స్వామి వారు ప్రతిష్ఠించిన ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ విగ్రహం నేడు ప్రపంచానికే దిశానిర్దేశం చేస్తోందని ప్రశంసించారు.
హనుమాన్ దీక్షా పీఠం అధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సిద్దిపేట ప్రాంత ప్రజలకు, స్వామీజీకి విడదీయరాని బంధం ఉందని, ఆయన వద్ద మాల ధరించడం కోసం వేలాది మంది భక్తులు వేచి చూస్తుంటారని పేర్కొన్నారు. భక్తుల కోరికను మన్నించి గత రెండేళ్లుగా స్వామీజీ స్వయంగా సిద్దిపేటకే విచ్చేసి మాలాధారణ చేయించడం ఆ ప్రాంత ప్రజల పట్ల ఆయనకున్న వాత్సల్యానికి నిదర్శనమని అన్నారు. ప్రతి ఏటా కోమటి చెరువులో జరిగే తెప్పోత్సవంలో సైతం స్వామీజీ పాల్గొని భక్తులను ఆశీర్వదించడం తమకు ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపారు. దుర్గాప్రసాద్ స్వామీజీ కృషి వల్లనే ఒకప్పుడు కొద్దిమందితో ప్రారంభమైన హనుమాన్ దీక్షలు, నేడు లక్షలాది మందికి చేరి ఒక మహా ఉద్యమంలా సాగుతున్నాయని అభినందించారు.
ఆంజనేయ స్వామి విశిష్టతను వివరిస్తూ, హనుమంతుడు క్రమశిక్షణకు, నిరుపమానమైన విధేయతకు, అసమాన సాహసానికి నిలువెత్తు రూపమని హరీశ్ రావు అభివర్ణించారు. ఏ కార్యాన్నైనా వాయువేగంతో పూర్తి చేసే శక్తి హనుమంతుడి సొంతమని, సీతమ్మ జాడ కనిపెట్టడం నుంచి లక్ష్మణుడి ప్రాణ రక్షణ కోసం సంజీవని పర్వతాన్ని మోసుకురావడం వరకు ఆయన చేసిన సేవలు దైవతుల్యమైనవని కొనియాడారు. సాక్షాత్తు దేవుళ్లకే సహాయం చేసిన ఆ మహావీరుడు, భక్తితో కొలిచే మానవమాత్రులపై కచ్చితంగా కరుణ చూపిస్తాడనే నమ్మకంతోనే నేడు ఇంతటి భారీ సంఖ్యలో భక్తులు హనుమాన్ దీక్షలు చేపడుతున్నారని అన్నారు. ఇంతటి మహత్తరమైన కుంభాభిషేక కార్యక్రమానికి ఆహ్వానించిన ఇరువురు స్వామీజీలకు ఆయన శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, పీఠం ప్రతినిధులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.