Mahaa Daily Exclusive

  గోదావరి పుష్కరాల నాటికి ‘పోలవరం’ పూర్తికి సహకరించండి….

Share

గోదావరి పుష్కరాల నాటికి ‘పోలవరం’ పూర్తికి సహకరించండి.
* కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ.
* తొలిదశలో 41.15 మీటర్ల నీటి నిల్వకు నిర్మాణాల పూర్తిపై వినతి.
*స్టాప్ వర్క్ ఆర్డర్ ఉపసంహరణకు, నిధుల రీయింబర్స్‌మెంట్‌కు విజ్ఞప్తి.
*భూసేకరణపై ఒడిశాకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్రానికి కోరిక.
ఢిల్లీ, మహా.

నవ్యాంధ్రప్రదేశ్‌ జీవనాడి, అత్యంత ప్రతిష్టాత్మక జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసి తీరాలన్న దృఢ సంకల్పంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేగవంతం చేసింది. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తన సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, నిధుల విడుదల, సాంకేతిక మరియు అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారంపై కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి ఉన్న అడ్డంకులను తొలగించాలని ఆయన విన్నవించారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తొలిదశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు వీలుగా అవసరమైన కీలక నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. ఇందుకు అనుగుణంగా ప్రాజెక్టు పనులకు ఆటంకంగా మారిన ‘స్టాప్ వర్క్ ఆర్డర్’ (నిర్మాణ పనుల నిలుపుదల ఉత్తర్వులు)ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు కుడివైపున నిర్మించాల్సిన హెడ్ స్లూయిజ్ నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేపడుతుందని కేంద్రానికి సీఎం స్పష్టం చేశారు. అలాగే, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాలువల సామర్థ్యాన్ని పెంచినందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుకు సంబంధించిన నిధులను వెంటనే రీయింబర్స్ (తిరిగి చెల్లించడం) చేయాలని కోరారు.
ప్రాజెక్టు నిర్మాణంతో పాటు రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న నీటి వనరుల పునరుద్ధరణ పనులకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఇందుకు తక్షణ సాయంగా రూ. 285 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన అవరోధంగా ఉన్న అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ వేగవంతం కావాల్సి ఉందని, ఈ విషయంలో పొరుగు రాష్ట్రమైన ఒడిశా ప్రభుత్వానికి అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర జలశక్తి శాఖను చంద్రబాబు కోరారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని గోదావరి పుష్కరాల నాటికి జాతికి అంకితం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి, నిధుల పరంగానూ, అనుమతుల పరంగానూ కేంద్రం వెన్నుదన్నుగా నిలవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.