Mahaa Daily Exclusive

  ‘వక్ఫ్’ చిచ్చు.. పక్కా స్కెచ్….

Share

‘వక్ఫ్’ చిచ్చు.. పక్కా స్కెచ్.
*ఖాజా మొయిజుద్దీన్‌ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.
*నెలకు రూ.5 లక్షల అద్దెల వ్యవహారంలోనే ఆలంఖాన్‌తో విబేధాలు.
*ప్రాణం తీసే ఉద్దేశం లేదన్న నిందితుడు.. కాళ్లు చేతులు విరగ్గొట్టాలనే టార్గెట్.
*రెండేళ్లలో 10 సార్లు విఫలయత్నం.. చివరకు సినీ స్టంట్ మాస్టర్‌తో ఘాతుకం.

హైదరాబాద్, మహా.
నగరంలో సంచలనం సృష్టించిన ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. వక్ఫ్ భూముల ఆధిపత్య పోరు, భారీగా వచ్చే అద్దెల వ్యవహారమే ఈ దారుణానికి దారితీసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆలంఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు.
**రూ.5 లక్షల అద్దెల కోసం..**
ఖాజా మొయిజుద్దీన్, ఆలంఖాన్‌ల మధ్య కొంతకాలంగా వక్ఫ్ భూముల నిర్వహణ, ఆధిపత్యానికి సంబంధించి తీవ్రస్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సదరు వక్ఫ్ ఆస్తుల నుంచి ప్రతి నెలా వచ్చే సుమారు రూ.5 లక్షల అద్దెల వసూళ్ల వ్యవహారంలో ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మొయిజుద్దీన్‌ను ఎలాగైనా అడ్డుకోవాలని ఆలంఖాన్ కుట్ర పన్నాడు.
**టార్గెట్ అది కాదు.. కానీ..**
ఖాజా మొయిజుద్దీన్‌ను దారుణంగా అంతమొందించే ఉద్దేశం తనకు లేదని ఆలంఖాన్ పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. కేవలం అతడిని భయపెట్టాలని, తీవ్రంగా దాడి చేసి కాళ్లు, చేతులు విరగ్గొట్టాలన్నదే తమ ఉద్దేశమని నిందితుడు చెప్పుకొచ్చాడు. తద్వారా అతడిని వక్ఫ్ భూముల వ్యవహారం నుంచి శాశ్వతంగా దూరం చేయాలని భావించినట్లు తెలిపాడు. కానీ, దాడి చేసే క్రమంలో పరిస్థితి చేయిజారి అది హత్యకు దారితీసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు.
**రెండేళ్లలో 10 సార్లు స్కెచ్.. చివరకు..**
ఈ దాడి కోసం ఆలంఖాన్ గత రెండేళ్లుగా పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 10 సార్లు మొయిజుద్దీన్‌పై దాడికి స్కెచ్ వేసినప్పటికీ.. వివిధ కారణాల వల్ల అవి అమలు కాలేదు. అదృష్టం కొద్దీ మొయిజుద్దీన్ ప్రతిసారీ తృటిలో తప్పించుకున్నాడు. దీంతో ఎలాగైనా సరే ఈసారి తన పంతం నెగ్గించుకోవాలనే కసితో ఆలంఖాన్ ఏకంగా ఓ సినిమా స్టంట్ మాస్టర్‌ను రంగంలోకి దించాడు. పక్కా ప్రణాళికతో స్టంట్ మాస్టర్, అతని బృందానికి సుపారీ ఇచ్చి దాడి చేయించగా.. ఈ ఘాతుకంలో మొయిజుద్దీన్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది.
ప్రస్తుతం పోలీసులు ఈ స్టంట్ మాస్టర్ మరియు ఈ హత్యతో సంబంధం ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.