సంక్షేమ పథకాలకు డిజిటల్ కరెన్సీ.
* వినియోగాన్ని విస్తృతం చేసే దిశగా ఆర్బీఐ సన్నాహాలు.
*వార్షిక నివేదికలో కీలక అంశాల వెల్లడి.. పైలట్ ప్రాజెక్టుల విస్తరణకు నిర్ణయం.
ముంబై, మహా.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) వినియోగాన్ని మరింత విస్తృతం చేసే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు పరిమిత స్థాయిలోనే ఉన్న ఈ-రూపాయ్ వాడకాన్ని ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీకి, అలాగే రిటైల్ రంగానికి కూడా పూర్తిస్థాయిలో విస్తరించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆర్బీఐ తన తాజా వార్షిక నివేదికలో డిజిటల్ కరెన్సీ విస్తరణ ప్రణాళికలను స్పష్టంగా పొందుపరిచింది. రాబోయే రోజుల్లో సామాన్యుడికి ఈ సేవలను మరింత చేరువ చేసేందుకు వీలుగా, ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టును మరింత విస్తరించాలని నిర్ణయించింది.
క్షేత్రస్థాయిలో డిజిటల్ కరెన్సీ పనితీరును, ప్రభుత్వ పథకాల బదిలీలో దాని ఆవశ్యకతను అంచనా వేసేందుకు ఇప్పటికే పలు ప్రయోగాలు చేపట్టినట్లు కేంద్ర బ్యాంక్ వెల్లడించింది. ఇందులో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్, పుదుచ్చేరి, చండీగఢ్ ప్రాంతాల్లో నగదు బదిలీ పథకాల కింద డిజిటల్ కరెన్సీని ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు ఆర్బీఐ తన నివేదికలో వివరించింది. ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ లబ్ధిదారులకు అందించే ఆహార సబ్సిడీని సైతం సీబీడీసీ ద్వారానే విజయవంతంగా అందించినట్లు స్పష్టం చేసింది.
అయితే, ఈ విధానంలో పారదర్శకతను పెంచేందుకు ఆర్బీఐ పకడ్బందీ చర్యలు చేపట్టింది. లబ్ధిదారులకు అందిన డిజిటల్ నిధులను దుర్వినియోగం కాకుండా, కేవలం రేషన్ షాపులు, ఎంపిక చేసిన నిర్దిష్ట వ్యాపారుల వద్ద వస్తువుల కొనుగోలుకు మాత్రమే ఉపయోగించేలా సాంకేతిక నియంత్రణలు విధించింది. ఈ పైలట్ ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇస్తుండటంతో, దీన్ని మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లాలని ఆర్బీఐ భావిస్తోంది. ఇకముందు చేపట్టే సీబీడీసీ పైలట్ ప్రాజెక్టుల్లో మరింత మంది ప్రజలను, వ్యాపారులను భాగస్వాములుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ అడుగులతో రాబోయే రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీలో కీలక మార్పులు రానున్నట్లు స్పష్టమవుతోంది.








