తెలంగాణలో బతకాలంటే పాస్‌పోర్ట్, వీసా కావాలా?
*సీఎం, డిప్యూటీ సీఎంలను బెదిరించిన ఎమ్మెల్యే సామేల్‌పై కేసు నమోదు చేయాలి.
* కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.
హైదరాబాద్, మహా.
ప్రొఫెసర్ నాగేశ్వర్ చుట్టూ అలుముకున్న వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త రాజకీయ దుమారానికి తెరతీసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “తెలంగాణలో బతకాలంటే ప్రత్యేకంగా పాస్‌పోర్ట్, వీసా ఏమైనా తీసుకురావాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ?” అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలను వెంటనే జూబ్లీహిల్స్ వదిలి వెళ్లిపోవాలంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగిన ఎమ్మెల్యే సామేల్‌పై సుమోటోగా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని ఆయన డిమాండ్ చేశారు.
ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే అత్యున్నత స్థాయి వ్యక్తులకే తెలంగాణలో ఇలాంటి బహిరంగ బెదిరింపులు ఎదురైతే, ఇక ఉపాధి కోసం అక్కడికి వెళ్లిన సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటని విష్ణువర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఐదు కోట్ల మంది ఆంధ్రులను తీవ్రంగా అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. వాస్తవానికి తెలంగాణ ప్రజలు అందరినీ ఆదరించే ప్రేమ స్వభావం కలవారని, కానీ కొందరు నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం విద్వేషాలు రెచ్చగొడుతూ రాష్ట్రాన్ని నాశనం చేసేలా ప్రవర్తిస్తున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని హితవు పలికారు.
ఈ వివాదానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారమే ప్రధాన కారణమైంది. మూడు రోజుల క్రితం ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీకి చెందిన పోలీసులు హైదరాబాద్‌కు వచ్చారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ పరిణామంపై స్పందించిన తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ కొందరు జర్నలిస్టులతో కలిసి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు హైదరాబాద్‌లో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. బతకడానికి ఇక్కడికి వచ్చిన వారు పద్ధతిగా ఉండాలని, తెలంగాణ మేధావులపై అరాచకాలు సాగవని హెచ్చరించారు. ఇక్కడ పెత్తనం చెలాయిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణలో మరోసారి ఆంధ్ర నేతల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలతో అకస్మాత్తుగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.








