మృత్యు ఒడి నుంచి మాతృమూర్తి ఒడికి
*సౌదీ ఉరిశిక్ష నుంచి బయటపడిన అబ్దుల్ రహీమ్.
*రూ. 34 కోట్ల విరాళాలు సేకరించి కాపాడుకున్న మలయాళీలు.
* 20 ఏళ్ల తర్వాత కన్నీటి భావోద్వేగాల మధ్య స్వగ్రామానికి రాక.
కోజికోడ్,మహా.
బతుకుదెరువు కోసం ఇరవై ఏళ్ల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఒక సామాన్యుడు, ఊహించని విధంగా ఉరికొయ్య అంచులకు చేరాడు. కానీ, మానవత్వం దారితీసిన మహా సంకల్పం అతడికి పునర్జన్మను ప్రసాదించింది. ఏకంగా రూ.34 కోట్ల ‘క్షమాధనం’ చెల్లించి, సౌదీ అరేబియాలో మరణశిక్ష నుంచి బయటపడిన కేరళ వాసి అబ్దుల్ రహీమ్ ఎట్టకేలకు తన సొంతగడ్డకు చేరుకున్నాడు. విమానాశ్రయం నుంచి నేరుగా కోజికోడ్‌లోని తన స్వగ్రామానికి చేరుకున్న అతడిని చూడగానే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆనందభాష్పాలతో స్వాగతం పలికారు. ఇన్నేళ్ల తర్వాత ఇంటి గుమ్మం వద్ద తన కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న కన్నతల్లిని చూసి రహీమ్ గుండెలకు హత్తుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
కేరళలోని కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో ఉపాధి వెతుక్కుంటూ సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఒక దివ్యాంగ బాలుడికి కేర్‌టేకర్‌గా విధుల్లో చేరాడు. అయితే, ఒకరోజు జరిగిన అనుకోని ప్రమాదంలో ఆ బాలుడు మృతి చెందాడు. దీంతో అబ్దుల్ రహీమ్‌పై సౌదీ అధికారులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. బాలుడి కుటుంబం అతడికి క్షమాభిక్ష పెట్టేందుకు ససేమిరా అనడంతో, సుదీర్ఘ విచారణ అనంతరం 2018లో సౌదీ న్యాయస్థానం రహీమ్‌కు మరణశిక్ష విధించింది. సౌదీ చట్టాల ప్రకారం ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే బాధిత కుటుంబానికి భారీ మొత్తంలో ‘బ్లడ్ మనీ’ (క్షమాధనం) చెల్లించాల్సి ఉంటుంది.
రహీమ్‌ను ఉరిశిక్ష నుంచి కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఒక్కటయ్యారు. తమ తోటి వాడి ప్రాణాలు నిలబెట్టేందుకు భారీ ఎత్తున విరాళాల సేకరణ చేపట్టారు. చందాల రూపంలో ఏకంగా 15 మిలియన్ల సౌదీ రియాల్స్ (మన కరెన్సీలో సుమారు రూ. 34 కోట్లు) సమీకరించి సౌదీ కోర్టుకు చెల్లించారు. అడిగినంత క్షమాధనం అందడంతో న్యాయస్థానం అతడిని విడుదల చేసింది. బుధవారం రాత్రి సౌదీ నుంచి బయలుదేరిన రహీమ్, గురువారం ఉదయం కేరళలోని కరిపూర్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.
ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. తన విడుదలకు సహకరించిన, విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటానని రెండు చేతులూ జోడించి కృతజ్ఞతలు తెలిపాడు. అపరిచితులైన ఎంతోమంది దాతల ఔదార్యం వల్లే తాను మళ్లీ తన తల్లిని కలుసుకోగలిగానని కన్నీటి పర్యంతమయ్యాడు. రహీమ్ రాకతో ఆ ఊరిలో పండుగ వాతావరణం నెలకొంది. తమ సంతోషం రెట్టింపయిందని, ఇన్నాళ్లకు తమ ప్రార్థనలు ఫలించాయని రహీమ్ బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. తల్లికొడుకులు కలుసుకున్న దృశ్యం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.








