Mahaa Daily Exclusive

  విద్యార్థినులకు పీరియడ్స్ సెలవులు….

Share

విద్యార్థినులకు పీరియడ్స్ సెలవులు.
* అసంఘటిత రంగ మహిళలకు ప్రసూతి లీవ్స్.
* కేరళ నూతన ప్రభుత్వ విధానాలను ప్రకటించిన గవర్నర్.
* ఏటా రూ.25 లక్షల ఆరోగ్య బీమా.
తిరువనంతపురం, మహా.
దేశంలోనే సామాజిక భద్రత, మహిళా సాధికారతలో ఎల్లప్పుడూ ముందుండే కేరళ రాష్ట్రం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చదువుకునే విద్యార్థినులకు ప్రతినెలా మూడు రోజుల పాటు రుతుక్రమ (పీరియడ్స్) సెలవులు ఇవ్వాలని నూతనంగా ఏర్పడిన యూడీఎఫ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో పాటు అసంఘటిత రంగాల్లో పని చేస్తూ ఎలాంటి భద్రత లేని మహిళా కార్మికులకు పూర్తి జీతంతో కూడిన ఆరు నెలల ప్రసూతి (మెటర్నిటీ) సెలవులను వర్తింపజేయాలని తీర్మానించింది. కేరళ 16వ అసెంబ్లీ తొలి సమావేశాల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఈ మేరకు ప్రభుత్వ నూతన విధానాలను సభలో అధికారికంగా ప్రకటించారు.
ముఖ్యమంత్రి వీడీ సతీశన్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందుకు ఉంచేందుకు త్వరలోనే సమగ్రమైన శ్వేతపత్రాన్ని విడుదల చేయనుందని గవర్నర్ వెల్లడించారు. ఇదే వేదికగా సామాన్య ప్రజలకు అండగా నిలిచే భారీ ఆరోగ్య బీమా పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఉమెన్ చాందీ స్మారకార్థం ‘ఉమెన్ చాందీ ఆరోగ్య బీమా పథకం’ పేరిట అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య బీమా కల్పించనున్నట్లు సభలో ప్రకటించారు. అయితే ఈ పథకం విధివిధానాలు, అమలు తీరుపై త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.
వీటితో పాటు సాంకేతిక, సామాజిక రంగాల్లో అభివృద్ధికి బాటలు వేస్తూ పలు కీలక నిర్ణయాలను విధాన ప్రసంగంలో వెల్లడించారు. అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో ఒక ‘మీడియా సిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. గిరిజన భూ చట్టాలపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడంతో పాటు, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ప్రత్యేక నియామక డ్రైవ్‌లు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే, కేరళలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలకు కూడా విస్తరించనున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.
మరోవైపు, ప్రభుత్వ విధాన ప్రసంగంపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రసంగంలో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన స్పష్టమైన విజన్ లేదని ఆయన విమర్శించారు. గత ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారం నుంచి తప్పుకునేటప్పుడు ఖజానాకు రూ.5,429 కోట్లకు పైగా బదిలీ చేసిందని, ఆ వాస్తవాన్ని దాచిపెడుతూ ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనే తప్పుడు సంకేతాలు ఇస్తోందని మండిపడ్డారు. ఇదిలా ఉంటే, గవర్నర్ ప్రసంగ సమయంలో డీజీపీ అసెంబ్లీలోకి రావడం ప్రోటోకాల్ ఉల్లంఘనే అని విజయన్ అభ్యంతరం వ్యక్తం చేయగా, అది పొరపాటున జరిగి ఉండవచ్చని స్పీకర్ బదులిచ్చారు. అలాగే, అసెంబ్లీలో వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించకపోవడం పట్ల బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో స్వల్ప దుమారం రేగింది.