Mahaa Daily Exclusive

  నీట్ రీటెస్ట్‌పై కేంద్రం పకడ్బందీ చర్యలు…..

Share

నీట్ రీటెస్ట్‌పై కేంద్రం పకడ్బందీ చర్యలు.
*పీఎంఓ ప్రత్యక్ష పర్యవేక్షణలో పరీక్ష.
* రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి భేటీ.
ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జూన్ 21న నిర్వహించనున్న రీటెస్ట్‌లో మరోసారి ఎలాంటి లోపాలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈసారి పరీక్షా ప్రక్రియను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) స్వయంగా పర్యవేక్షించనుంది. ప్రశ్నాపత్రం తయారీ మొదలుకుని ఫలితాల వెల్లడి వరకు ప్రతి అంచెనూ నిశితంగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన దిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
దిల్లీలోని రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో సుమారు 40 నిమిషాల పాటు ఈ అత్యున్నత స్థాయి భేటీ జరిగింది. నీట్ రీటెస్ట్‌లో ఎలాంటి అవకతవకలు జరగకుండా తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలపై ఇందులో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, పీఎంఓ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేపర్ తయారీ, ప్రింటింగ్, రవాణా, పరీక్షా కేంద్రాలకు చేర్చడం తదితర ప్రతి ప్రక్రియను ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షించనున్నట్లు సమాచారం. నీట్ రీటెస్ట్‌కు సంబంధించిన తాజా పరిణామాలను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకుంటున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ఏడాది మే 3న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 5,400కు పైగా కేంద్రాల్లో నీట్ యూజీ పరీక్షను నిర్వహించింది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 12న కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసింది. దీనికి బదులుగా జూన్ 21న రీటెస్ట్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. అక్రమాలకు చెక్ పెట్టే క్రమంలో వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. పరీక్షల నిర్వహణలో సర్కార్ పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వంలో పేపర్ లీక్ మాఫియా యథేచ్ఛగా వర్ధిల్లుతోందని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యత వహించాల్సిన వారు కేవలం చోద్యం చూస్తున్నారని రాహుల్ విమర్శించారు. విపక్షాల నుంచి వస్తున్న ఈ తీవ్ర విమర్శల నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
ఇదిలా ఉండగా, రద్దయిన నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన ఫీజు రీఫండ్ ప్రక్రియపై ఎన్‌టీఏ కీలక ప్రకటన చేసింది. అభ్యర్థులు తమ ఫీజును వెనక్కి పొందేందుకు వీలుగా బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించే గడువును జూన్ 22 వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు మే 27తో ముగియాల్సి ఉండగా, మే 3 నాటి పరీక్షకు సంబంధించిన అంతరాయాల నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా దీన్ని పొడిగించారు. అభ్యర్థులు నీట్ 2026 రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా తమ బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేసి, నేరుగా తమ ఖాతాల్లోకి ఫీజు రీఫండ్‌ను పొందవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.