తాను తీర్పులు చెప్పిన కోర్టుకే నిందితురాలిగా.
*కోడలి మృతి కేసులో మాజీ జడ్జి గిరిబాలా సింగ్ అరెస్ట్.
*తల్లీకొడుకులకు ఐదు రోజుల సీబీఐ కస్టడీ విధింపు.
* భోపాల్ జిల్లా కోర్టులో నాటకీయ పరిణామాలు.
భోపాల్,మహా.
ఒకప్పుడు న్యాయస్థానంలో ఉన్నత స్థానంలో కూర్చుని ఎన్నో కేసుల్లో తీర్పులు వెలువరించిన ఒక మాజీ జిల్లా జడ్జికి.. ఇప్పుడు అదే కోర్టులో నిందితురాలిగా బోనులో నిలబడాల్సిన పరిస్థితి ఎదురైంది. నటి, మోడల్ అయిన తన కోడలు ట్విషా శర్మ అనుమానాస్పద మృతి, వరకట్న వేధింపుల కేసులో మాజీ జడ్జి గిరిబాలా సింగ్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆమెతో పాటు కుమారుడు సమర్థ్ సింగ్ను భోపాల్ జిల్లా కోర్టులో హాజరుపరచగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇద్దరికీ ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
గతేడాది (2023) ఫిబ్రవరిలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా గిరిబాలా సింగ్ పదవీ విరమణ పొందారు. అయితే, ఒకప్పుడు తమకు ఉన్నతాధికారిగా పనిచేసిన ఆమెను సీబీఐ అధికారులు నిందితురాలిగా తీసుకురావడంతో భోపాల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో తీవ్ర నాటకీయ వాతావరణం నెలకొంది. ఆమెను చూసేందుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పెద్ద ఎత్తున గుమిగూడారు. భద్రతా బలగాల పహారా నడుమ కోర్టు భవనంలోని మూడో అంతస్తులో ఉన్న గదికి ఆమెను తీసుకువెళ్లారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన కోర్టు విచారణ సమయంలో గిరిబాలా సింగ్, ఆమె కుమారుడు సమర్థ్ నిందితుల బోనులోనే నిలబడ్డారు. విచారణ జరుగుతున్నంత సేపు ఆమె ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించకపోవడం గమనార్హం. ఆమె చాలా ప్రశాంతంగా తన న్యాయవాదులతో, కుమారుడితో మాట్లాడుతూ కనిపించారు.
**అసలేం జరిగిందంటే..**
నటి, మోడల్ అయిన ట్విషా శర్మకు సమర్థ్ సింగ్తో వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కొద్ది నెలలకే మే 12వ తేదీన ట్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. వివాహం జరిగినప్పటి నుంచి అదనపు కట్నం కోసం, ఇతర కారణాలతో తన కుమార్తెను అత్త గిరిబాలా సింగ్, భర్త సమర్థ్ తీవ్రంగా వేధించారని ట్విషా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక మాజీ న్యాయమూర్తిపై నేరుగా ఆరోపణలు రావడంతో ఈ కేసు స్థానికంగా సంచలనంగా మారింది. కేసు దర్యాప్తుపై తీవ్ర స్థాయి నుంచి ఒత్తిడి రావడంతో తొలుత ఈ వ్యవహారాన్ని భోపాల్ పోలీసులకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించింది. ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో కేసు దర్యాప్తును ప్రతిష్ఠాత్మక సీబీఐకి బదిలీ చేశారు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు గురువారం సుదీర్ఘ విచారణ అనంతరం తొలుత సమర్థ్ను, ఆ తర్వాత గిరిబాలా సింగ్ను అదుపులోకి తీసుకుని తాజాగా కోర్టులో హాజరుపరిచారు.








