Mahaa Daily Exclusive

  ఖరీఫ్‌కు సన్నద్ధం….

Share

ఖరీఫ్‌కు సన్నద్ధం.
* గోదావరి డెల్టా కాలువలకు ముందస్తు సాగునీరు విడుదల.
* ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రత్యేక పూజలు చేసిన మంత్రి కందుల దుర్గేష్.

రాజమహేంద్రవరం,మహా.
గోదావరి డెల్టా రైతాంగానికి ఖరీఫ్ (2026-27) సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం సాగునీటిని విడుదల చేసింది. ఎప్పటిలా కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ముందస్తు ఖరీఫ్ కోసం ఆదివారం (మే 31, 2026) ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ నుంచి ప్రధాన కాలువలకు అధికారులు నీటిని విడుదల చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బ్యారేజీ వద్ద ఉదయం స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి గోదావరి నదికి జలహారతి ఇచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీట నొక్కి తూర్పు డెల్టా కాలువలోకి నీటిని విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల మేలు కోసమే ఈ ముందస్తు నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
గోదావరి డెల్టా పరిధిలోని తూర్పు, పశ్చిమ గోదావరితో పాటు కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మొత్తం 10 లక్షల 13 వేల ఎకరాల ఆయకట్టుకు ఈ నీరు చేరనుంది. అయితే ప్రస్తుతం కాలువల మరమ్మతు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో నీటిని ఒకేసారి కాకుండా దశలవారీగా విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ మరమ్మతు పనులు జూన్ మధ్య నాటికి పూర్తి కానున్నాయని స్పష్టం చేశారు. ఎల్ నినో, అల్పపీడనాల వంటి వాతావరణ ప్రతికూల పరిస్థితులు పంట చేతికొచ్చే సమయానికి ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకే, రైతులు ముందస్తుగా నారుమడులు వేసుకునేలా ఒకరోజు ముందుగానే సాగునీటిని విడుదల చేసినట్లు మంత్రి దుర్గేష్ వివరించారు. మరోవైపు తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అక్టోబర్ 31 వరకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి మొత్తం 175 గేట్ల మరమ్మతుల నిమిత్తం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం రూ.148 కోట్లు మంజూరు చేసిందని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే గోదావరి నది కాలుష్య నియంత్రణకు అదనంగా మరో రూ.100 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ ముందస్తు సాగునీటి విడుదలతో గోదావరి డెల్టా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్నారు.