ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ.
* నోవాటెల్ హోటల్లో గంటన్నర పాటు సాగిన సుదీర్ఘ మంతనాలు.
* మంత్రులు వారంలో ఒకరోజు పార్టీ కోసం కేటాయించాలన్న తీర్మానంపై అధిష్టానానికి నివేదిక.
* ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై కీలక చర్చలు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను మరింత పటిష్టం చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో అత్యంత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల బృందం ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై రాష్ట్ర భవిష్యత్ కార్యాచరణపై లోతైన మంతనాలు జరిపింది.
న్యూఢిల్లీ నుంచి కర్ణాటకలోని గుల్బర్గా (కలబురగి) వెళ్లే క్రమంలో విమాన ప్రయాణం మధ్యలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆదివారం హైదరాబాద్లో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రితో పాటు ఈ కీలక సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు. సుమారు గంటన్నర పాటు అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగిన ఈ సుదీర్ఘ భేటీలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఆరు గ్యారెంటీల అమలు తీరుపై ప్రధానంగా చర్చించారు.
ఇటీవల గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడికి వివరించారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రులందరూ వారంలో ఒక రోజు తప్పనిసరిగా పార్టీ కార్యక్రమాల కోసం కేటాయించాలన్న తీర్మానాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ప్రభుత్వంలో సముచిత ప్రాధాన్యం కల్పించే దిశగా తీసుకుంటున్న చర్యలను సైతం ఖర్గేకు వివరించారు. అధిష్టానం సూచనలతో పార్టీ, ప్రభుత్వ సమన్వయంతో ముందుకు సాగుతున్న తీరును నేతలు వివరించగా, ఖర్గే సంతోషం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం (జూన్ 1న) రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అమలుపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వెల్లడించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న ‘ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్’ విధివిధానాలపై సీఎం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.








