మెస్సీ హ్యాట్రిక్‌పై వివాదం..
* ఫిఫాకు అల్జీరియా సంచలన ఫిర్యాదు.
* అర్జెంటీనా విజయంపై నీలినీడలు!
* నిబంధనల ఉల్లంఘనలపై రాయిటర్స్ సంచలన కథనం.
* అర్జెంటీనా కెప్టెన్‌పై రెడ్ కార్డ్ డిమాండ్ చేసిన అల్జీరియా ఫుట్‌బాల్ అసోసియేషన్.
ఢిల్లీ, మహా.
ఫిఫా ప్రపంచకప్ 2026 లీగ్ దశలోనే అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతిష్టాత్మక మెగా టోర్నీలో తమ తొలి పోరాటంలోనే అల్జీరియాపై అర్జెంటీనా జట్టు ఘన విజయం సాధించి ఘనంగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా లెజెండ్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి అద్భుతమైన హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ విజయంతో లభించిన ఊపుతో తదుపరి మ్యాచ్‌లోనూ గెలిచి నాకౌట్ బెర్తును ఖరారు చేసుకోవాలని భావిస్తున్న అర్జెంటీనాకు ఊహించని షాక్ తగిలింది. మ్యాచ్‌లో రిఫరీ అత్యంత పేలవమైన రీతిలో వ్యవహరించాడని, ఆయన తప్పిదాల వల్లే తాము ఓడిపోయామంటూ అల్జీరియా ఏకంగా అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమైక్య (ఫిఫా) కు అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ ఉత్కంఠభరిత వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ ఒక ప్రత్యేక కథనంలో వెల్లడించింది.
అల్జీరియా లేఖలో సంచలన ఆరోపణలు
అల్జీరియా ఫిఫా రిఫరీయింగ్ కమిషన్‌కు సమర్పించిన లేఖలో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సిపై తీవ్ర ఆరోపణలు చేసింది. మ్యాచ్ నిబంధనలకు విరుద్ధంగా మెస్సి అత్యంత దురుసుగా ప్రవర్తించాడని పేర్కొంది. మైదానంలో తమ జట్టు ఆటగాడిని ఉద్దేశపూర్వకంగా కిందపడేసినప్పటికీ.. మెస్సికి రిఫరీ కనీసం ‘రెడ్ కార్డ్’ కూడా జారీ చేయలేదని అల్జీరియా ఆక్షేపించింది. మ్యాచ్‌లో జరిగిన పలు సాంకేతిక తప్పిదాలను, వీడియో క్లిప్పింగులను జత చేస్తూ ఫిఫాకు ఈ లేఖను సమర్పించారు.
ఆట మొదటి అర్ధభాగంలో అర్జెంటీనా కెప్టెన్ మెస్సి, అల్జీరియా కెప్టెన్ ఐస్సా మాండీ పిక్కపై ఉద్దేశపూర్వకంగా కాలు వేసి.. అతడు కిందపడిపోయేలా చేశాడని అల్జీరియా వివరించింది. అంతేకాకుండా, వెనుక భాగం నుంచి మెస్సి తన కాలి బూటుతో మాండీని బలంగా తన్నినట్లు విజువల్స్ స్పష్టంగా చూపిస్తున్నాయని ఆరోపించింది. ఈ తీవ్రమైన ఫౌల్ నేపథ్యంలో మెస్సిని తక్షణమే మైదానం నుంచి బయటకు పంపాలని తాము గట్టిగా డిమాండ్ చేసినప్పటికీ, మైదానంలో ఉన్న ప్రధాన రిఫరీ సైమన్ మార్సినియాక్ అర్జెంటీనా కెప్టెన్‌పై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా వదిలేశారని అల్జీరియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
వివాదం కేవలం మెస్సితోనే ఆగిపోలేదు. ఆట రెండో అర్ధభాగంలో కూడా రిఫరీ ఒకపక్షపాతంగా వ్యవహరించారని అల్జీరియా ఆరోపించింది. అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ అలెక్సిస్ మాక్ అల్లిస్టర్, తమ జట్టు ఆటగాడైన ఇబ్రహీం మజాపై మోచేతితో దాడికి తెగబడ్డాడని లేఖలో పేర్కొన్నారు. శారీరక దాడికి పాల్పడిన ఇంతటి తీవ్రమైన ఫౌల్ విషయంలోనూ రిఫరీ సైమన్ మార్సినియాక్ కళ్ళు మూసుకుని కూర్చోవడం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అల్జీరియా ఆవేదన వ్యక్తం చేసింది.
మ్యాచ్ ఆద్యంతం రిఫరీ పూర్తిగా అర్జెంటీనా జట్టుకు సానుకూలంగా వ్యవహరించాడని, ఆయన చేసిన ఇటువంటి ఘోరమైన తప్పిదాల వల్లే అర్జెంటీనాకు విజయం దక్కిందని అల్జీరియా ఫిర్యాదులో స్పష్టం చేసింది. ప్రపంచకప్ లాంటి అత్యున్నత వేదికపై ఇలాంటి అంపైరింగ్ ప్రమాణాలు ఉండటం క్రీడా స్ఫూర్తికే విరుద్ధమని తెలిపింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి, నియమ నిబంధనలను ఉల్లంఘించిన లియోనెల్ మెస్సితో పాటు మ్యాచ్‌ను సరిగ్గా నడిపించని రిఫరీ సైమన్ మార్సినియాక్‌పై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని అల్జీరియా ఫిఫాను గట్టిగా డిమాండ్ చేసింది. ఈ ఫిర్యాదుతో ఫిఫా క్రమశిక్షణా సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.







